ITR Filing | ఆదాయం పన్ను చెల్లింపుదారులు ప్రతియేటా నిర్ధిష్ట గడువు లోపు ఐటీ రిటర్న్స్ (ఐటీఆర్) సమర్పిస్తారు. సాధారణంగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి తుది గడువు జూలై 31. కరోనా కారణంగా పలు దఫాలు గడువు పొడిగించిన కేంద్రం.. ఈ ఏడాది గడువు పొడిగించడానికి ససేమిరా అంది. దీంతో 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ ఫైలింగ్ చేయడానికి గడువు జూలై 31తోనే ముగిసింది.
కొందరు వేతన జీవులు గడువులోపు ఐటీఆర్ సబ్మిట్ చేయలేకపోవచ్చు. అటువంటి వారుకొంత ఫైన్‌తో ఈ నెలాఖరు వరకు ఐటీఆర్ ఫైల్ చేసేందుకు గడువు ఉంది. ఒకవేళ, గడువులోపు ఐటీఆర్ దాఖలు చేసినా తప్పొప్పులు, పొరపాట్లు ఉన్నా.. 2022 డిసెంబర్ 31 లోపు రివైజ్డ్ ఐటీఆర్ సబ్మిట్ చేయొచ్చు. ఈ నెలాఖరులోపు ఐటీఆర్ సబ్మిట్ చేయని వారికి ఐటీ శాఖ నోటీసులు జారీ చేస్తుంది.
అయితే, ఈ ఏడాది ఆన్లైన్లో ఐటీఆర్ ఫైల్ చేయడం ఎలా? అనే అంశంపై నెటిజన్లు గూగుల్‌లో తెగ వెతికారు. ‘ఆన్ లైన్ లో ఐటీఆర్ ఎలా ఫైల్ చేయాలి?’ అనే అంశంపై చాలా మంది సెర్చ్ చేశారని ‘ఇయర్ ఇన్ సెర్చ్ -2022’ నివేదికలో గూగుల్ వెల్లడించింది. గత జూలై 24-30 మధ్య అత్యధిక మంది శోధించారని గూగుల్ ట్రెండ్ డేటా చెబుతున్నది.
ఆదాయం పన్ను విభాగం అధికారికంగా వెల్లడించిన సమాచారం పరకారం 2022-23లో ఇప్పటి వరకు 6.99 కోట్ల మందికి పైగా ఐటీఆర్ ఫైల్ చేశారు. వీటిలో 6.62 కోట్లు వెరిఫై చేశారు. 6.67 కోట్ల కంటే ఎక్కువ రిటర్న్స్ ఐటీ శాఖ ప్రాసెస్ చేసింది.