న్యూఢిల్లీ, మే 22 : జపాన్‌కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం హోండా..దేశీయ మార్కెట్లో ఎస్యూవీ విభాగాన్ని మరింత బలోపేతం చేయడంలో భాగంగా మరో మాడల్‌ను తీసుకొచ్చింది. ప్రీమియం ఎస్యూవీ జెడ్ఆర్-వీ మాడల్‌ను పరిచయం చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.11.99 లక్షలుగా నిర్ణయించింది. ఈ సందర్భంగా హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ సీఈవో, ప్రెసిడెంట్ తకాశి నకజిమా మాట్లాడుతూ..దేశీయ మార్కెట్లో మరింత పాగ వేయడానికి 2030 నాటికి మరో 10 కొత్త మాడళ్లను తీసుకురానున్నట్టు ప్రకటించారు.
వీటిలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో విడుదల చేయనున్న ఎలక్ట్రిక్ కారు కూడా ఉందన్నారు. నాలుగు మీటర్ల లోపు పొడువు కలిగిన మాడళ్లతోపాటు మధ్యస్థాయికి చెందిన వాహనాలకు దేశీయంగా డిమాండ్ అధికంగా ఉండటంతో వీటిపై ప్రత్యేక దృష్టి సారించినట్టు చెప్పారు. కంపెనీకి ఉత్తర అమెరికాతోపాటు జపాన్, భారత్ మార్కెట్లు చాలా కీలకంగా మారాయని, ఇక్కడి కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా వాహనాలను రూపొందిస్తున్నట్టు తెలిపారు.