New Cars in September | కొత్త ఎస్యూవీ కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా.. అందుకు వచ్చేనెల సరైన టైం అవుతుందని ఆటో రంగ నిపుణులు అంటున్నారు. ఈ నెలాఖరులో ఓనంతో పండుగల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వచ్చేనెలలో ఆరు కొత్త మోడల్ కార్లు మార్కెట్లోకి రానున్నాయి. వాటిల్లో ఎస్‌యూవీలు, ఎంవీపీలు, ఈవీ కార్లు ఉన్నాయి.
హోండా ఎలివేట్ ఎస్యూవీ వంటి మాస్ మార్కెట్ మోడల్ మొదలు వోల్వో సీ40 రీచార్జీ లేదా మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఈ వంటి కార్లు వచ్చేనెలలో అందుబాటులోకి రానున్నాయి. ప్రతి కారు కొనుగోలుపై పలు ఆఫర్లు లభిస్తున్నాయి.. మరి ఆ కార్ల గురించి తెలుసుకుందామా..!
ఎస్యూవీ సెగ్మెంట్లో ఎలివేట్ కారును ఆవిష్కరించిన హోండా కార్స్ ఇండియా ఇప్పటికే ప్రీ బుకింగ్స్ ప్రారంభించింది. ఎసవీ, వీ, వీఎక్స్, జడ్ ఎక్స్ వేరియంట్లలో ఎలివేట్ ఎస్యూవీ కారు వస్తోంది. ఇందులో హోండా సిటీ సెడాన్ కారులో వాడిన 1.5-లీటర్ల డీవోహెచ్ సీ ఐ-వీటెక్ పెట్రోల్ ఇంజిన్ వినియోగిస్తున్నారు. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ (అడ్వాన్డ్ సీవీటీ) తోపాటు గరిష్టంగా 119 బీహెచ్పీ విద్యుత్, 145.1 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. ఏడు సింగిల్ కలర్ ఆప్షన్స్ -ప్లాటినం వైట్ పెరల్, లునార్ సిల్వర్ మెటాలిక్, ఒబ్సిడియన్ బ్లూ పెరల్, రేడియంట్ రెడ్ మెటాలిక్, గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్, మీటరాయిడ్ గ్రే మెటాలిక్, ఫోనిక్స్ ఆరెంజ్ పెరల్ రంగుల్లో లభిస్తుంది.
వోల్వో ఇండియా.. దేశీయ మార్కెట్లో తన రెండో ఎలక్ట్రిక్ కారు ‘వోల్వో సీ40 రీచార్జి’ వచ్చేనెల 4న ఆవిష్కరించనున్నది. 78 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ తో వస్తున్న ఈ కారు ఇంజిన్ గరిష్టంగా 402 బీహెచ్పీ విద్యుత్, 660ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. సింగిల్ చార్జింగ్‌తో 530 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. భారత్ పరిస్థితులకు అనుగుణంగా గ్లోబల్ డబ్ల్యూఎల్టీపీ స్టాండర్డ్ తో రూపుదిద్దుకున్నదీ కారు.
దేశంలో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీగా నిలుస్తున్న టాటా నెక్సాన్.. న్యూ అవతార్‌లో వస్తోంది. టాటా మోటార్స్ కర్వ్ కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకున్న నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేనెల 14న మార్కెట్లో లాంచ్ చేస్తారు. స్ప్లిట్ హెడ్ ల్యాంప్ సెటప్, హారియర్, సఫారీల్లో వినియోగించిన న్యూ అండ్ లార్జర్ 10.25-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తున్నది. 1.2 లీటర్ల పెట్రోల్, 1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్లతో టాటా నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ ఆవిష్కరిస్తారు.
దేశంలోనే బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ వెహికల్ నెక్సాన్ ఈవీ విత్ ఐసీఈ వర్షన్‌తో అదే రోజు ఆవిష్కరిస్తారు. నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ ఎస్ యూవీ తరహాలోనే డిజైన్లు, ఇంటీరియర్ అప్ డేట్స్ ఉంటాయి. నెక్సాన్ ఈవీ ప్రస్తుతం రెండు బ్యాటరీ ఆప్షన్లతో గంటకు 312 కి.మీ నుంచి 453 కి.మీ వేగంతో దూసుకెళ్లగల సామర్థ్యం గల కారు మార్కెట్లో అందుబాటులో ఉంది.
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్.. భారత్ మార్కెట్లో తన మూడో ఈవీ కారు ‘ఈక్యూఈ’ ఎస్యూవీ ని ఆవిష్కరించేందుకు రంగం సిద్ధం చేసింది. గ్లోబల్ మార్కెట్లలో ఈక్యూఈ సింగిల్ మోటార్ సెటప్ తో వస్తున్నది. గరిష్టంగా 292 హెచ్‌పీ విద్యుత్, 565 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. ఈక్యూఈ 350 4మ్యాటిక్ డ్యుయల్ మోటార్ సెటప్ కలిగి ఉండటంతోపాటు గరిష్టంగా 765 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. ఈక్యూఈ 500 4 మ్యాటిక్ డ్యుయల్ మోటార్ సెటప్ కలిగి ఉండటంతోపాటు గరిష్టంగా 408 హెచ్‌పీ, 858 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. వీటిల్లో 90.6 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ వినియోగిస్తున్నారు. సింగిల్ చార్జింగ్ తో సుమారు 500 కి.మీ దూరం ప్రయాణించొచ్చు.
ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ సిట్రోన్ తన తొలి కంపాక్ట్ ఎస్ యూవీ కారు ‘సీ3 ఎయిర్ క్రాస్’ భారత్ మార్కెట్లో వచ్చేనెలలో ఆవిష్కరించనున్నది. ఏడు సీట్లతో వస్తున్న ఈ కారు 1.2 లీటర్ల టర్బో చార్జ్డ్ యూనిట్ ఇంజిన్ తో వస్తుంది. ఈ ఇంజిన్ 5500 ఆర్పీఎం వద్ద 108 బీహెచ్పీ, 1750 ఆర్పీఎం వద్ద 190 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ కారు మార్కెట్లోకి వస్తున్నది.