టోక్యో, డిసెంబర్ 23: జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటో రంగ సంస్థలు హోండా, నిస్సాన్ ఒక్కటవుతున్నాయి. తాజాగా ఇరు కంపెనీలు ఓ అవగాహన ఒప్పందాన్ని (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. ఈ రెండింటి కలయికతో ఏర్పడబోయే కొత్త సంస్థ.. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటో రంగ సంస్థ కానున్నది. వాహన అమ్మకాలపరంగా టయోటా, ఫోక్స్వాగన్ల తర్వాత హోండా-నిస్సాన్‌ల కంపెనీయే నిలువబోతున్నది.
ప్రస్తుతం మూడో స్థానంలో హ్యుందాయ్-కియా గ్రూప్ ఉన్నది. 2026 ఆగస్టుకల్లా ఈ విలీనం పూర్తికావచ్చన్న అంచనాలున్నాయి. కాగా, ఈ మెగా విలీనంలో మిట్సుబిషి మోటర్స్ కూడా భాగం కాబోతున్నది. ఈ మేరకు టోక్యోలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో స్పష్టమైన సంకేతాలొచ్చాయి. మిట్సుబిషిలో నిస్సాన్‌కు మెజారిటీ వాటా ఉన్న విషయం తెలిసిందే. చైనా, అమెరికా మార్కెట్లలో అమ్మకాల క్షీణత నేపథ్యంలో హోండా, నిస్సాన్‌లు విలీనానికి సిద్ధపడడం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. ఇప్పటికే ఉద్యోగ, ఉత్పత్తిలో కోతలకూ ప్లాన్ వేశాయి.