Property Insurance | గృహమే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు. మరి ఆ ఇంటికీ రక్షణ ఉండాలి కదా. అందుకే ఇండ్లకూ ఇన్సూరెన్స్లొచ్చేశాయ్. గృహ బీమాను ప్రాపర్టీ ఇన్సూరెన్స్ లేదా హోమ్ ఓనర్ ఇన్సూరెన్స్‌గా కూడా పిలుస్తారు. ఎక్స్టీరియర్-ఇంటీరియర్ డ్యామేజీలకు కవరేజీనిస్తుంది. ఇంట్లోని వస్తుసామాగ్రీకి కూడా బీమా రక్షణ లభిస్తుంది. ఇంట్లో దురదృష్టవశాత్తూ జరిగే ఏదైనా ప్రమాదాలకూ వర్తిస్తుంది.
హోమ్ ఇన్సూరెన్స్ సదుపాయాన్ని ఎస్బీఐ, శ్రీరామ్ జనరల్, బజాజ్ అలియాంజ్, భారతీ యాక్సా, రాయల్ సుందరం, రిలయన్స్, రహేజా క్యూబీఈ, ఓరియంటల్, న్యూ ఇండియా అష్యూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్, ఫ్యూచర్ జనరాలీ, చోళమండలం వంటి సంస్థలు అందిస్తున్నాయి. ఇండ్ల యజమానులు, అద్దెకుండేవారు ఈ బీమాను తీసుకోవచ్చు. కొన్ని సంస్థలు హౌజింగ్ సొసైటీలకూ బీమాను కల్పిస్తున్నాయి. తీవ్రవాదుల దాడి, భూకంపాల్లో ధ్వంసమైనా బీమాను ఇస్తామని మరికొన్ని సంస్థలు ప్రకటిస్తున్నాయి.
షరతులు, ప్రీమియంలనుబట్టి ఆయా సంస్థలు.. అగ్ని ప్రమాదాలు, డాక్యుమెంట్ల నష్టం, దొంగతనాలు, గృహోపకరణాల డ్యామేజీ, వ్యక్తిగత ప్రమాద బీమా, అద్దె ఎగవేత, పెంపుడు జంతువుల సంరక్షణ, ఇల్లు పూర్తిగా దెబ్బతింటే ప్రత్యామ్నాయ వసతి ఖర్చులు, బ్యాగేజీ నష్టం, థర్డ్ పార్టీ-ఎంప్లాయ్ లయబిలిటీస్, ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ కవరేజీలను అందిస్తున్నాయి. ఇంట్లోని విలువైన ఎలక్ట్రిక్-ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫర్నీచర్, ఆభరణాలకూ బీమా కవరేజీ ఉంటుంది. ప్రకృతి విపత్తుల్లో ధ్వంసమైనా, అల్లర్లతో ప్రభావితమైనా ఇన్సూరెన్స్‌ను పొందవచ్చు. ఒకవేళ గృహ రుణం పరిధిలో ఇల్లు ఉన్నైట్టెతే ప్రీమియంలు అధికంగా ఉంటాయి.
గృహ బీమా పాలసీలు దీర్ఘకాలానికిగాను కొనుక్కోవచ్చు. అలాగే కనిష్టంగా ఏడాది కాలపరిమితితో కూడా తీసుకోవచ్చు. ఇండిపెండెంట్ హౌజ్‌లు, అపార్ట్మెంట్లలో ఫ్లాట్లకు అనుగుణంగా ఈ పాలసీల కవరేజీని ఎంచుకోవచ్చు. నివాస ప్రాంతాన్నిబట్టి, పాలసీ వ్యవధి ఆధారంగా ప్రీమియంలుంటాయి. అయితే వాటిల్లిన నష్టానికి కారణం ఉద్దేశపూర్వక చర్యేనని తేలితే బీమా వర్తించదు.