Hyderabad | న్యూఢిల్లీ, డిసెంబర్ 21: దేశవ్యాప్తంగా ఇండ్ల విక్రయాలు గరిష్ఠ స్థాయిలో పడిపోతున్నాయి. రోజురోజుకు అమ్మకాలు అంతకంతకు కిందకు దిగుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుండటం, మరోవైపు అస్తవ్యస్థ ఆర్థిక విధానాలతో పెట్టుబడిదారుల్లో నమ్మకం సడులుతున్నది. దీంతో ఒకప్పుడు ఉవ్వెత్తున ఎగిసిన దేశీయ రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ అంతే వేగంతో కిందకు పడిపోతున్నది. ప్రస్తుతేడాది అమ్మకాలు చూస్తే ఇది అవగతం అవుతున్నది. ఇండ్ల అమ్మకాలపై ఈ మధ్యకాలంలో విడుదలైన నివేదికలు ఈ విషయాన్ని స్పష్టంచేస్తున్నాయి.
తాజాగా ప్రాప్ఈక్విటీ సంస్థ విడుదల చేసిన గణాంకాలు కూడా ఈ విషయాన్ని స్పష్టంచేశాయి. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికిగాను దేశవ్యాప్తంగా తొమ్మిది నగరాల్లో ఇండ్ల అమ్మకాలు 21 శాతం పడిపోయాయని వెల్లడించింది. ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, నవీ ముంబై, కోల్కతా, బెంగళూరు, పూణె, హైదరాబాద్, చెన్నై, థానే వంటి మెట్రో నగరాల్లో 1.08 లక్షల యూనిట్ల ఇండ్లు అమ్మడయ్యాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో అమ్ముడైన 1,37,225 యూనిట్లతో పోలిస్తే భారీగా తగ్గాయి. కేవలం ఢిల్లీ-ఎన్సీఆర్లో మాత్రమే విక్రయాలు పెరిగాయని తెలిపింది. ఇండ్ల అమ్మకాలు పడిపోయిన నగరాల్లో హైదరాబాద్ టాప్ ప్లేస్లో ఉన్నది.
అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలంలో హైదరాబాద్లో 12,682 యూనిట్లు అమ్ముడయ్యాయని, క్రితం ఏడాది నమోదైన 24,044తో పోలిస్తే 47 శాతం తగ్గాయని పేర్కొంది. అలాగే బెంగళూరులో గృహ విక్రయాలు 13 శాతం తగ్గి 14,957లకు పడిపోగా, చెన్నైలో 9 శాతం తగ్గి 4,673 యూనిట్ల నుంచి 4,266లకు జారుకున్నాయి. అధిక బేస్ రేట్ కారణంగా ఇండ్ల విక్రయాలు పడిపోయాయని ప్రాప్ఈక్విటీ సీఈవో, ఫౌండర్ సమీర్ జాసుజా తెలిపారు. పండుగ సీజన్ కావడంతో మూడో త్రైమాసికంతో పోలిస్తే ఆ తర్వాతి క్వార్టర్లో అమ్మకాలు పెరిగాయని తెలిపారు.