GST Receipts | ఆగస్టు జీఎస్టీ వసూళ్లలో 11 శాతం గ్రోత్ నమోదు చేశామని కేంద్ర రెవెన్యూ విభాగం కార్యదర్శి సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఆగస్టు నెలలో సుమారు రూ.1.6 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు జరిగాయన్నారు. జీఎస్టీ వసూళ్లు రూ.1.6 లక్షల కోట్లు దాటడం వరుసగా మూడో నెల అని శుక్రవారం చెప్పారు. 2022 ఆగస్టులో రూ.1,43,612 కోట్ల జీఎస్టీ వసూళ్లు జరిగాయి. నిబంధనలకు లోబడి చెల్లింపులు పెరుగుతున్నాయని, పన్ను ఎగవేతలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు.
ఈ ఏడాది ఏప్రిల్లో జీఎస్టీ వసూళ్లు రూ.1.87 లక్షల కోట్లు నమోదయ్యాయి. జీఎస్టీ శకం ప్రారంభమైనప్పటి నుంచి ఇదే ఆల్ టైం రికార్డు. శుక్రవారం రాత్రి పొద్దుపోయే లోపు గత నెలలో జీఎస్టీ వసూళ్ల డేటా విడుదల చేస్తామని మల్హోత్రా మీడియాకు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ 7.8 శాతంగా నమోదైందన్నారు.
సాధారణ జీడీపీ రేటు కంటే జీఎస్టీ వసూళ్లు పెరిగాయని సంజయ్ మల్హోత్రా తెలిపారు. జూన్ త్రైమాసికంలో జీఎస్టీ వసూళ్లలో 11 శాతానికి పైగా గ్రోత్ రికార్డైందన్నారు. జీడీపీతో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు 1.3 శాతానికి పైగా పెరిగాయన్నారు. పన్ను వసూళ్ల పెరుగుదలకు కారణం అధికారుల సమర్థతే కారణం అని అన్నారు. పన్నులు పెంచకున్నా వసూళ్లు పెరిగాయని మల్హోత్రా తెలిపారు.