న్యూఢిల్లీ, ఆగస్టు 26: కేంద్ర ప్రభుత్వాల మద్దతుతోనే దేశంలో గ్రీన్ ఎకానమీ లక్ష్యం సాకారమవుతుందని టాటా స్టీల్ గ్లోబల్ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్ అన్నారు. కాబట్టి ముందుగా ఆ లక్ష్య సాధనకు అనుకూలమైన విధానాలను తీసుకురావాలని మోదీ సర్కారుకు సూచించారు. ఇక్కడ జరుగుతున్న బీ20 సదస్సులో శనివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రీన్ ఎకానమీ అనేది ఓ సంక్లిష్టమైన సవాల్ అని అభిప్రాయపడ్డారు. స్టీల్సహా అనేక రంగాల్లో మార్పు అంత తేలిక కాబోదన్నారు. నానాటికీ పెరుగుతూపోతున్న కర్బన ఉద్గారాలపై మెజారిటీ దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో, గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉందంటున్న క్రమంలో నరేంద్రన్ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉక్కు అత్యంత సాధారణంగా వాడే వస్తూత్పత్తి అని, స్టీల్ లేనిదే ఏదీ ఉండబోదని నరేంద్రన్ చెప్పారు. చివరకు గ్రీన్ ఎకానమీ లక్ష్య సాధనకూ ఉక్కు చాలా అవసరమని, సోలార్ ప్యానెల్స్‌ను నిలబెట్టడానికి, విండ్‌మిల్స్‌ను ఏర్పాటు చేయడానికి, స్టోరేజ్, పైప్‌లైన్స్ ఇలా అన్నింటికీ స్టీల్ కీలకమని గుర్తుచేశారు. రాబోయే కొన్ని దశాబ్దాల్లో.. ప్రతి దశాబ్దంలో 100-150 మిలియన్ టన్నుల ఉక్కు సామర్థ్యాన్ని పెంచుకునే దేశాల్లో భారత్ మాత్రమే ఉందన్నారు. ఇక సిమెంట్ తయారీ 200-300 మిలియన్ టన్నులు పెరిగిపోవచ్చన్నారు. కాబట్టి స్టీల్, సిమెంట్ తదితర రంగాల్లో టెక్నాలజీపరంగా పరిష్కారాలను కనుగొని గ్రీన్ ఎకానమీ సాధనకు ప్రయత్నించాలిగానీ.. వీటికి ప్రత్యామ్నాయాలను గుర్తించి లక్ష్యాన్ని చేరుకోవాలంటే కుదరబోదని స్పష్టం చేశారు. మొత్తానికి ప్రస్తుత ఇండస్ట్రీ పర్యావరణహితంగా మారాలంటే చాలా ఖర్చు అవుతుందని, ఇందుకు పరిశ్రమ యాజమాన్యాలు సిద్ధంగా ఉన్నా.. ప్రభుత్వం వైపు నుంచీ కావాల్సిన మద్దతు అవసరమన్నారు.