Airports | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: విమానాశ్రయాల ప్రైవేటీకరణను మోదీ సర్కారు మళ్లీ మొదలుపెట్టింది. ప్రభుత్వ ఆస్తుల నగదీకరణ నుంచి పెద్ద ఎత్తున ఆదాయాన్ని పొందాలన్న లక్ష్యం పెట్టుకున్న కేంద్రం.. ఏకంగా వచ్చే ఏడాది మార్చికల్లా దేశంలోని 13 ఎయిర్‌పోర్టులను ప్రైవేట్‌పరం చేయాలని చూస్తున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ అంశాన్ని ఇంటర్-మినిస్టీరియల్ కన్సల్టేషన్‌లో ప్రస్తావనకు తీసుకొచ్చినట్టు కూడా చెప్తున్నారు.
జాతీయ నగదీకరణ ప్రణాళిక కింద 2022 నుంచి 2025 వరకు మొత్తం దేశవ్యాప్తంగా 25 ఎయిర్‌పోర్టులను ప్రైవేట్‌పరం చేయాలని కేంద్రం నిర్ణయించుకున్నది. వీటిలో భువనేశ్వర్, వారణాసి, అమృత్సర్, తిరుచ్చి, ఇండోర్, రాయ్‌పూర్, కాలీకట్, కోయంబత్తూర్, నాగ్‌పూర్, పాట్నా, మధురై, సూరత్, జోధ్‌పూర్, రాంచీ, చెన్నై, విజయవాడ, రాజమండ్రి, వడోదర, భోపాల్, తిరుపతి, హుబ్లీ, ఇంపాల్, అగర్తల, డెహ్రాడూన్, ఉదయ్‌పూర్ ఉన్నాయి. ఈ క్రమంలోనే ముందుగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బోర్డు (ఏఏఐ) 13 ఎయిర్‌పోర్టులను గుర్తించింది. దీంతో వీటి ప్రైవేటీకరణకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కేబినెట్ అనుమతికి సిద్ధమైంది. అయితే మధ్యప్రదేశ్ ప్రభుత్వం.. రాయ్‌పూర్, ఇండోర్ విమానాశ్రయాల ప్రైవేటీకరణకు అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో సదరు జాబితా 11 ఎయిర్‌పోర్టులకు తగ్గింది. ఈలోగా గత ఏడాది లోక్‌సభ ఎన్నికలు రావడంతో ప్రైవేటీకరణకు బ్రేక్ పడింది. కానీ మూడోసారీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే కొలువుదీరడంతో ఇప్పుడిక మళ్లీ విమానాశ్రయాల ప్రైవేటీకరణపై సర్కారు పెద్దలు దృష్టి సారించారు.
ఎయిర్‌పోర్టుల ప్రైవేటీకరణపై రాష్ర్టాల నుంచి గట్టిగానే విమర్శలు వస్తున్నాయి. లాభాల్లో ఉన్న విమానాశ్రయాలు ఈ దెబ్బతో నష్టాల్లోకి జారుకుంటాయని, ప్రైవేట్ రంగంలో కొన్ని బడా కార్పొరేట్ సంస్థల గుత్తాధిపత్యంలోకి దేశీయ విమానయాన పరిశ్రమ వెళ్లిపోతుందన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ప్యాసింజర్లపై అనవసరపు చార్జీలు వచ్చిపడతాయని, పారదర్శకత లోపిస్తుందని అంటున్నారు. ముఖ్యంగా అదానీ గ్రూప్ కోసమే ఈ ప్రైవేటీకరణ తంతు అన్న ఆరోపణలూ వస్తున్నాయి. ఇక ఇప్పటికే వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను ఈ నెల 1న పార్లమెంట్లో ప్రకటించిన బడ్జెట్లో.. రాబోయే ఐదేండ్లలో ప్రభుత్వ ఆస్తులను అమ్మి రూ.10 లక్షల కోట్లను ఖజానాకు తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టుల ప్రైవేటీకరణ తిరిగి పట్టాలెక్కుతున్నది. ఇదిలావుంటే ప్రైవేటీకరణ ప్రక్రియలో భాగంగా తొలిసారి 6 పెద్ద ఎయిర్‌పోర్టులతో 7 చిన్న ఎయిర్‌పోర్టులను కలిపేయాలని భావిస్తున్నారు. వారణాసితో ఖుషీనగర్-గయా, అమృత్‌సర్‌తో కంగ్రా, భువనేశ్వర్‌తో తిరుపతి, రాయ్‌పూర్‌తో ఔరంగాబాద్, ఇండోర్‌తో జబల్పూర్, తిరుచిరాపల్లితో హుబ్లీ క్లబ్ చేయాలని చూస్తున్నారు.