హైదరాబాద్, జూలై 5: తెలంగాణలో స్టీల్ వినిమయం భారీగా పుంజుకుంటున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 5.48 మిలియన్ టన్నుల స్టీల్‌ను వినియోగం జరిగింది. అంటే 3.5 కోట్ల జనాభా కలిగిన రాష్ట్రంలో ఒక్కో వినియోగదారుడు సగటున 156.43 కిలోల స్టీల్‌ను వినియోగించారని డెలాయిట్ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. హైదరాబాద్‌లో జరుగుతున్న ఐఎస్ఏ స్టీల్ ఇన్ఫ్రాబిల్డ్ సమ్మిట్‌లో ఈ నివేదికను విడుదల చేసింది. అంతక్రితం ఏడాదిలో 4.73 మిలియన్ టన్నులుగా ఉన్నది.
దేశవ్యాప్తంగా తలసరి స్టీల్ వినిమయం 93.4 కిలోలు కాగా, తెలంగాణలో ఇంతకంటే అధికంగా ఉన్నదని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక రంగం పరుగులు పెడుతుండటం ఇందుకు కారణమని వెల్లడించింది. అలాగే ప్రతియేటా 7.3 శాతం వృద్ధితో వచ్చే పదేండ్లలో దేశవ్యాప్తంగా స్టీల్‌కు డిమాండ్ 221-275 మిలియన్ టన్నులుగా ఉంటుందని పేర్కొంది. స్టీల్ వినిమయంలో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాలు అగ్రస్థానంలో నిలుస్తున్నాయని, మొత్తం వినిమయంలో వీటి వాటా 41 శాతంగా ఉందని వెల్లడించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.6,500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టబోతున్నట్లు స్టీల్ ఆథార్టీ ఆఫ్ ఇండియా(సెయిల్)సీఎండీ అమరేందు ప్రకాశ్ తెలిపారు. వచ్చే కొన్నేండ్లలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడుల్లో భాగంగా ఈ ఏడాది వ్యాపార విస్తరణకోసం ఈ నిధులను ఖర్చు చేయబోతున్నట్లు చెప్పారు. చైనా నుంచి దిగుమతవుతున్న నాసిరకం స్టీల్‌ను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు.