New CEA Nageshwaran | కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ)గా వీ అనంత నాగేశ్వరన్ నియమితులయ్యారు. ఈయన ప్రధానమంంత్రి ఆర్థిక సలహా మండలి (సీఎంఈఏసీ) మాజీ సభ్యుడు. ఈ నెల 31 నుంచి బడ్జెట్ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్లమెంట్లో ఆర్థిక సర్వే, వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించడానికి కొద్ది రోజుల ముందు కేంద్ర ప్రభుత్వం ముఖ్య ఆర్థిక సలహాదారును నియమించడం ప్రాధాన్యం సంతరించుకున్నది. గతేడాది డిసెంబర్ 17న కేవీ సుబ్రమణ్యం వైదొలిగినప్పటి నుంచి సీఈఏ పదవి ఖాళీగా ఉంది.
అహ్మదాబాద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం-అహ్మదాబాద్)లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నాగేశ్వరన్.. సింగపూర్తోపాటుభారత్లో ప్రధాన బిజినెస్ స్కూళ్లలో ఇంటర్నేషనల్ ఎకనమిక్స్, ఎక్స్చేంజ్ రేట్స్, ఫైనాన్సియల్ మార్కెట్స్పై పాఠాలు బోధిస్తారు. అమ్హెరెస్ట్లోని మాసాచ్చుసెట్స్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ డిగ్రీ అందుకున్నారు.
ఇంతకుముందు నాగేశ్వరన్.. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో సభ్యుడిగా ఉన్నారు. 2019-21 మధ్య ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో సభ్యుడిగా సేవలందించిన నాగేశ్వరన్‌ను 2021 అక్టోబర్‌లో కౌన్సిల్ పునర్వ్యవస్థీకరించినప్పుడు తిరిగి నియమించలేదు. ఐఎఫ్ఎంఆర్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్‌గానూ, క్రెయా యూనివర్సిటీ ఎకనమిక్స్ విజిటింగ్ ప్రొఫెసర్‌గా పని చేశారు.
కేంద్ర ఆర్థిక విధానాల రూపకల్పనలో, ప్రభుత్వ ఆర్థిక విధానాల వ్యూహల ఖరారులో సీఈఏ కీలకంగా వ్యవహరిస్తారు. ప్రతియేటా ప్రభుత్వ విధి విధానాలను ఆర్థిక సర్వే ద్వారా తెలియజేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తారు. సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు సమర్పిస్తారు. గతంలో మాదిరిగా కాకుండా ఆర్థిక సర్వే సింగిల్ వాల్యూమ్ డాక్యుమెంట్‌గా ఉంటుంది. 15వ ఆర్థిక సంఘం అధిపతి ఎన్కే సింగ్, ఆర్థిక వ్యవహారాలశాఖ కార్యదర్శి, సిబ్బంది-శిక్షణా వ్యవహారాలశాఖ కార్యదర్శిలతో కూడిన కమిటీ.. సీఈఏను ఎంపిక చేసింది. 10-12 దరఖాస్తులు వచ్చాయి.