భారతీయ కుటుంబాల వద్ద 20వేల టన్నుల బంగారం ఉందని అంచనా. ఇదంతా వృథాగా ఇండ్లలోనే ఉంటున్నదని, దాన్ని ఆర్థిక వ్యవస్థలో భాగం చేయాలని మోదీ సర్కార్ ఎప్పట్నుంచో తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. అయితే ఇప్పటిదాకా ఉన్న పథకాలతో ఆ ఆశయం నెరవేరలేకపోయింది. అందుకే సరికొత్తగా, ఆకర్షణీయంగా పసిడి నగదీకరణ పథకానికి రూపకల్పన జరుగుతున్నట్టు సమాచారం. ప్రస్తుత పథకంలోని లోపాలను సరిదిద్ది ఈసారి విజయవంతం కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తున్నది.
ప్రపంచవ్యాప్తంగా బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉన్నది. దేశీయ దిగుమతుల్లో ముడి చమురు తర్వాతి స్థానం పసిడిదే. ఈ దిగుమతులకు డాలర్లలోనే చెల్లించాల్సి వస్తున్నది. దీంతో దేశంలోని ఫారెక్స్ నిల్వలు కరిగిపోతున్నాయి. పైగా రూపాయిపై ఒత్తిడి పెరుగుతున్నది. అందుకే ప్రభావవంతమైన పసిడి నగదీకరణ పథకానికి కేంద్రం రూపకల్పన చేస్తున్నదని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికి ఆదరణ బాగుంటే రూపీపై ఒత్తిడి తగ్గుతుందని, దిగుమతుల బిల్లు దిగొస్తుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మొత్తానికి మారిన ట్రెండ్‌ను అందిపుచ్చుకొని, ఆకర్షణీయ రాబడులు మదుపర్లకు అందించేలా సరికొత్త డిపాజిట్ ఆధారిత స్కీమ్‌ను తెస్తున్నట్టు తెలుస్తున్నది.
ఈసారి మార్పులేంటి?
ఇప్పుడున్న గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ఆకట్టుకోలేకపోయింది. అయితే అందులోని లోపాలను సరిదిద్ది కొత్త పథకాన్ని రూపొందిస్తున్నారని చెప్తున్నారు. ఈ క్రమంలోనే మదుపర్లను ఆకట్టుకోవడానికి మరింత ఎక్కువగా రాబడులిచ్చే వడ్డీరేట్లు, ఇతర విధివిధానాలుండే వీలున్నది. అలాగే బ్యాంకుల ద్వారా సులభతర ప్రక్రియతో పసిడి నగదీకరణ పథకం అమలుకు ప్రయత్నిస్తున్నారు. అనువైన మొత్తాల్లో డిపాజిట్లు, పన్నులపై స్పష్టత ఇచ్చేలా కృషి చేస్తున్నారు. తద్వారా సాధారణ ప్రజానీకం సైతం స్కీమ్‌లో భాగస్వాములయ్యేలా చేయాలని కేంద్రం భావిస్తున్నది. ఇప్పుడున్న స్కీమ్ 1-3 ఏండ్లే. దీంతో కాలపరిమితిని పెంచనున్నారని సమాచారం.
జీజేసీ మాటేంటి?
పసిడి నగదీకరణ పథకంలో సవరణలపై జరుగుతున్న చర్చల్లో అఖిల భారత రత్నాలు, ఆభరణాల మండలి (జీజేసీ) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరిపింది. ఈ సందర్భంగా బ్యాంకింగ్, రిఫైనింగ్, జ్యుయెల్లరీ రంగాలతో చర్చల తర్వాత సిద్ధం చేసిన జ్యుయెల్లర్-ఇంటిగ్రేటెడ్ విధానాన్ని జీజేసీ సమర్పించింది. పథకంలో సేకరించిన బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి భౌతిక రూపంలో కంటే భౌతికేతర రూపం (డిజిటల్)లో తేవడంపై దృష్టిసారించాలని ఇందులో ప్రతిపాదించింది. మదుపర్ల ఆలోచనా సరళికి తగ్గట్టుగా బులియన్, నాణేలు, నగలను అన్నింటినీ కవర్ చేసేలా పథకం ఉండాలన్నది. మొత్తంగా ఓ ఆదాయ వనరుగా బంగారాన్ని ఇచ్చినవారికి పథకం ఉంటేనే విజయవంతం కాగలదని సర్కార్‌కు జీజేసీ చెప్పింది.
మారిన ట్రెండ్
జనం మాట…
మార్కెట్లో బంగారం ధరలు ఏ స్థాయిలో దూసుకుపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌లో తాము డిపాజిట్ చేసిన పసిడికి డిపాజిట్ కాలపరిమితి పూర్తయ్యాక.. అధిక వడ్డీరేటునేగాక, అప్పటి మార్కెట్ ధరలను అనుసరించి తమ పుత్తడికి రేటు చెల్లించాలన్న అభిప్రాయాలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.
నిపుణులేమంటున్నారు?
ఇప్పటిదాకా వచ్చిన పసిడి నగదీకరణ పథకాలు ప్రభుత్వానికి భారమే అయ్యాయి. మరింత ఆకర్షణీయ ప్లాన్ల అవసరం ఉన్నది.
-సుభాష్ చంద్ర గార్గ్, మాజీ ఆర్థిక కార్యదర్శి
ఇప్పుడున్న పథకం విఫలమైంది. ప్రజలు తమ ఆభరణాలను కరిగించడానికి ఇష్టపడకపోవడమే కారణం. ఇకనైనా మార్కెట్ ఆధారిత వ్యవస్థలతో పథకాలను అనుసంధానించాలి.
-సురేంద్ర మెహెతా, బులియన్ ఎక్స్పర్ట్
గోల్డ్ మానిటైజేషన్ పథకాల్లో బ్యాంకులు కార్యచరణ సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ప్యూరిటీ పరిశీలన వంటి వాటికి పరిష్కారం చూపాల్సి ఉన్నది.
-ఆర్కే టక్కర్, యూకో బ్యాంక్ మాజీ ఎండీగుర్తుంచుకోండి
పసిడి నగదీకరణ పథకంలో డిపాజిట్ చేసిన బంగారాన్ని కరిగించేస్తారు. మన నగలను తిరిగి అదే రూపంలో పొందలేం. అయితే మెచ్యూరిటీ సమయంలో మళ్లీ నాణ్యమైన పుత్తడిని అందుకోవచ్చు. మోసాలకు తావుండదు.
డిపాజిట్ కాలపరిమితి అంతా ఇప్పుడున్న (దాదాపు 2.25-2.5 శాతం వార్షిక వడ్డీ)దానితో పోల్చితే అధిక వడ్డీరేటును చెల్లించే అవకాశం ఉన్నది.