Gold Rates | అమెరికా దిగుమతి చేసుకునే స్టీల్, అల్యూమినియం తదితర ఉత్పత్తులపై సుంకాలు పెంచుతామని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన.. దాంతో ఫారెక్స్ మార్కెట్లో యూఎస్ డాలర్‌పై రూపాయి విలువ బలహీనం కావడం.. దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధర ‘బుల్’ మీద పరుగులు తీస్తోంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో సోమవారం ఒక్కరోజే 99.9శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.2,430 వృద్ధితో తాజా జీవిత కాల గరిష్టాన్ని తాకి రూ.88,500 వద్ద ముగిసిందని ఆల్ ఇండియా సరఫా అసోసియేసన్ పేర్కొంది. కాగా దేశీయ బులియన్ మార్కెట్లో ఇటీవలి కాలంలో బంగారం ధర ఇంత భారీగా పెరగడం ఇదే మొదటి సారి.
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్‌లో ఔన్స్ బంగారం ధర 2900 డాలర్లతో తాజా గరిష్ట రికార్డు పలికింది. స్టీల్, అల్యూమినియం ఉత్పత్తుల దిగుమతులపై 25 శాతం సుంకాలు పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ప్రకటించడంతో రిటైలర్లు, జ్యువెల్లర్ల నుంచి బంగారానికి కొనుగోళ్ల మద్దతు లభించింది. గత శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో 99.9శాతం స్వచ్ఛత గల బంగారం ధర రూ.86,070 వద్ద ముగిసింది.
ఇక సోమవారం 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ. 2,430 పెరిగి రూ. 88,100లతో తాజా రికార్డు నమోదు చేసింది. ఇక కిలో వెండి ధర సోమవారం రూ. 1,000 పెరిగి రూ.97,500 వద్ద ముగిసింది. అంతర్జాతీయ పరిస్థితుల్లో అనిశ్చితితో ఇన్వెస్టర్లు రిస్క్‌తో కూడుకున్న స్టాక్స్‌కు బదులు బంగారం వంటి సురక్షిత పెట్టుబడి ఆప్షన్ల వైపు మళ్లుతున్నారని వ్యాపారులు చెబుతున్నారు.
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో గోల్డ్ కాంట్రాక్ట్స్ ఏప్రిల్ డెలివరీ తులం బంగారం ధర రూ.940 వృద్ధితో రూ. 85,828 లకు చేరుకుని జీవిత కాల గరిష్టాన్ని తాకింది. మెటల్ ఉత్పత్తులపై 25 శాతం దిగుమతి సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనతో బంగారం లాభాలు గడించింది. ఎంసీఎక్స్‌లో తులం బంగారం రూ. 85,800 ఎగువన ట్రేడ్ అవుతుండగా, గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ బంగారం 2,900 డాలర్ల మార్క్‌ను దాటేసింది. అయితే, ఏయే దేశాల నుంచి దిగుమతి చేసుకునే మెటల్స్ మీద సుంకాలు పెంచుతామన్న విషయమై ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ క్లారిటీ ఇవ్వలేదు. కిలో వెండి జూన్ డెలివరీ ధర రూ.1,015 (1.18 శాతం) పెరిగి తాజా గరిష్ట స్థాయికి చేరుకోవడంతో రూ. 86,636 వద్ద ముగిసింది. ఇక సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి డెలివరీ ధర రూ.632 పెరిగి రూ.95,965 వద్ద స్థిర పడింది.
అంతర్జాతీయంగా కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్‌లో ఔన్స్ బంగారం ధర 45.09 డాలర్లు (1.56 శాతం) పెరిగి 2,932.69 డాలర్లతో తాజా గరిష్టాన్ని తాకింది. ఆసియా మార్కెట్లలో కామెక్స్ సిల్వర్ ఫ్యూచర్స్‌లో ఔన్స్ వెండి ధర దాదాపు ఒకశాతం పుంజుకుని 32.76 డాలర్లు పలికింది.