Gold Price | బంగారం ధరలు కొనుగోలుదారులకు స్వల్ప ఊరటనిచ్చాయి. ఆభరణాల వ్యాపారులు, స్టాకిస్టులు అమ్మకాలు జరుపడంతో ధరలు దిగివచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ధరలు పతనమయ్యాయి. 24 క్యారెట్స్ గోల్డ్‌పై రూ.160 తగ్గింది. దీంతో తులం ధర రూ.99,800కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్స్ పసిడి రూ.150 తగ్గి.. తులానికి రూ.99,100కి తగ్గింది. అదే సమయంలో వెండి ధర స్థిరంగా కొనసాగుతున్నది. కిలో వెండి ధర రూ.1,05,200 పలుకుతున్నది ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. మరో వైపు గ్లోబల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు స్పల్పంగా తగ్గి.. 3,365.40 పడిపోయింది. సోమవారం ధరలు పెరిగినా.. ఆ తర్వాత తగ్గాయని కోటక్ సెక్యూరిటీస్‌లోని కమోడిటీ రీసెర్చ్ ఏపీవీ కైనత్ చైన్వాలా తెలిపారు.
టెహ్రాన్‌పై వాషింగ్టన్ దాడులకు దిగడంతో పెట్టుబడిదారులు ఇరాన్ ఎలా స్పందిస్తుందో వేచి చూస్తున్నారు. కీలకమైన పరిస్థితులను పెట్టుబడిదారులు నిశితంగా పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు. యూఎస్ ఫెడరల్ బ్యాంక్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగం, యూఎస్ జీడీపీ డేటా, కోర్ పర్సనల్ కంజమ్షన్ ఎక్స్పెండేచర్ (PCE) ఇన్ఫ్లమేషన్ డేటాపై పెట్టుబడిదారులు దృష్టి సారించారని చెప్పారు. ఫెడరల్ రిజర్వ్ నుంచి మిశ్రమ సంకేతాల మధ్య ద్రవ్య విధానం దిశపై కొత్త సూచనలు ఇచ్చే అవకాశం ఉన్నది. యూఎస్, యూకేతో సహా ప్రధాన ఆర్థిక వ్యవస్థల పీఎంఐ డేటా గ్లోబల్ ఫైనాన్స్ వెల్త్ గురించి కొత్త సూచనలు ఇస్తుందని కమోడిటీ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. పీఎంఐ అంటే పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్.
తయారీ-సేవా రంగం కార్యకలాపాలను కొలిచే ఆర్థిక సూచిక. ఫ్లాష్ పీఎంఐ అనేది నెలాఖరుకి కొన్ని రోజుల ముందు విడుదలయ్యే నివేదిక. ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విశ్లేషకురాలు రియా సింగ్ ప్రకారం.. జూన్‌లో ఇప్పటివరకు దేశీయ బంగారం ధరలు 4శాతం పెరిగాయి. అయితే, బలహీనమైన డిమాండ్ కారణంగా ప్రపంచ ధరలు తగ్గుతున్నాయి. పండుగల షాపింగ్ సమయంలో మందగమనం ఉన్నప్పటికీ, గోల్డ్‌బార్స్, నాణేలకు, ముఖ్యంగా 10 గ్రాముల నాణేలపై పెట్టుబడులు డిమాండ్ బలంగా ఉంది. ద్రవ్యోల్బణ భయాలు, తక్కువ తయారీ ఖర్చులు దీనికి కారణమని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లో బంగారం ధరల విషయానికి వస్తే.. 22 క్యారెట్స్ గోల్డ్ రూ.92,300 ఉండగా.. 24 క్యారెట్స్ గోల్డ్ రూ.1,00,690 పలుకుతున్నది. వెండి ధర విషయానికి వస్తే కిలోకు రూ.1.20లక్షలు పలుకుతున్నది.