Gold Rates | మెక్సికో, కెనడాలపై విధించిన టారిఫ్‌ల అమలును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా నెల రోజులు నిలిపేయడంతో దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ధగధగ మెరుస్తున్నాయి. దేశీయంగా పెండ్లిండ్ల సీజన్ ప్రారంభం కానుండటంతో బంగారానికి గిరాకీ పెరిగింది. ఫలితంగా పుత్తడి ధర మంగళవారం వరుసగా ఐదో రోజు ఫ్రెష్ రికార్డ్ నమోదు చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.500 వృద్ధి చెంది రూ.85,800 వద్ద ముగిసింది. రిటైలర్లు, జ్యువెల్లర్ల నుంచి గిరాకీ పెరగడం వల్లే బంగారం ధర పెరిగిందని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ తెలిపింది. సోమవారం 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.85,300 వద్ద ముగిసింది. 2025లో ఇప్పటి వరకూ తులం బంగారం ధర రూ.6,410 (8.07 శాతం) పెరిగి రూ.రూ. 85,800 లకు చేరుకుంది. గత నెల ఒకటో తేదీన తులం బంగారం (99.9 శాతం స్వచ్ఛత) ధర రూ.79,390 పలికింది.
మంగళవారం వరుసగా ఐదో సెషన్లో 99.5 శాతం స్వచ్ఛత గల తులం బంగారం ధర రూ.500 పుంజుకుని రూ. 85,400 వద్ద నిలిచింది. ఇక కిలో వెండి ధర ఐదు రోజుల దూకుడుకు బ్రేక్‌పడింది. మంగళవారం రూ.500 పతనమై రూ. 95,500 వద్ద ముగిసింది. సోమవారం కిలో వెండి ధర రూ.96,000తో స్థిర పడింది.
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో బంగారం ఏప్రిల్ డెలివరీ ధర రూ.208 (0.25 శాతం) తగ్గి రూ.83,075లకు చేరుకుంది. కెనడా, మెక్సికోలపై విధించిన సుంకాలను తాత్కాలికంగా నిలిపేయడం వల్ల బంగారం ధర తగ్గిందని ఎల్కేపీ సెక్యూరిటీస్ కమొడిటీ అండ్ కరెన్సీ వీపీ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది పేర్కొన్నారు. వెండి మార్చి డెలివరీ కిలో ధర రూ.35 తగ్గి రూ.94,222 వద్ద స్థిర పడింది.
అంతర్జాతీయ మార్కెట్లో కామెక్స్ గోల్డ్‌లో ఏప్రిల్ డెలివరీ ఔన్స్ బంగారం ధర 17 డాలర్లు తగ్గి 2840.10 డాలర్లకు పడిపోయింది. సోమవారం ఔన్స్ బంగారం ధర 2,872 డాలర్లతో తాజా జీవిత కాల గరిష్టాన్ని తాకింది. సిల్వర్ కామెక్స్‌లో ఔన్స్ వెండి ధర 0.71 శాతం తగ్గి 32.20 డాలర్ల వద్ద స్థిర పడింది. సరిహద్దుల్లో నిఘా పెంచుతామని మెక్సికో, కెనడా ప్రభుత్వాలు హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా నెల రోజులుగా ఆ దేశాలపై విధించిన టారిఫ్‌లను నిలిపేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సుంకాల పెంపు నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు బంగారాన్ని స్వర్గధామంగా పరిగణిస్తున్నారు.