న్యూఢిల్లీ, జూలై 30: గత ఐదు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ ప్రియమయ్యాయి. స్టాకిస్టులు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో పదిగ్రాముల బంగారం ధర మళ్లీ రూ.98 వేల మార్క్‌ను దాటింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం ధర రూ.700 ఎగబాకి రూ.98,520కి చేరుకున్నది. మంగళవారం ధర రూ.97,820గా ఉన్నది.
అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బం గారం ధర రూ.650 అందుకొని రూ.98,200 పలికింది. బంగారంతోపాటు వెండి పరుగులు పెట్టింది. కిలో వెండి రూ.1,000 అందుకొని రూ.1,14,000కి చేరుకున్నట్టు ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. డాలర్‌తో పోలిస్తే రూపా యి మారకం విలువ భారీగా పడిపోవడంతో క్రూడాయిల్ ధరలు భగ్గుమన్నాయి. దీంతో బంగారం ధరలు భారీగా పుంజుకున్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 3,330.33 డాలర్లు పలుకగా, వెండి 38.09 డాలర్లుగా నమోదైంది.