Gold Rate | న్యూఢిల్లీ, మే 12: రికార్డుస్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు ఎట్టకేలకు శాంతించాయి. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతోపాటు అమెరికా-చైనా దేశాల మధ్య ప్రతీకార సుంకాల విధింపు వాయిదా పడటంతో మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాల నుంచి ఈక్విటీ మార్కెట్లకు తరలించడంతో భారీ స్థాయిలో ధరలు దిగొచ్చాయి.
దేశ రాజధాని న్యూఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల పుత్తడి ధర రూ.3,400 తగ్గి రూ.96,500కి దిగొచ్చినట్టు ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం కూడా ఇంతే స్థాయిలో తగ్గి రూ.96,100కి చేరుకున్నది. గడిచిన పది నెలల్లో ఒకేరోజు ఇంతటి స్థాయిలో తగ్గుముఖం పట్టడం ఇదే తొలిసారి. జూలై 23, 2024న బంగారం ధర రూ.3,350 తగ్గిన విషయం తెలిసిందే. శనివారం గోల్డ్ ధర రూ.99,950 స్థాయిలో ఉన్నది. ఇటు హైదరాబాద్‌లో 24 క్యారెట్ తులం ధర రూ.1,800 తగ్గి రూ.96,880కి దిగిరాగా, 22 క్యారెట్ ధర రూ.1,650 తగ్గి రూ.88,800గా నమోదైంది.
బంగారంతోపాటు వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడంతో కిలో వెండి రూ.200 తగ్గి రూ.99,700కి దిగొచ్చింది. అలాగే హైదరాబాద్‌లో కిలో వెండి రూ.2,000 తగ్గి రూ.1,09,00గా నమోదైంది. ప్రతీకార సుంకాల విధింపుపై అమెరికా-చైనా దేశాల మధ్య గత వారం రోజులుగా జరుగుతున్న చర్చలు ఎట్టకేలకు కొలిక్కివచ్చాయి.
చైనా ఉత్పత్తులపై అమెరికా సుంకాన్ని 145 శాతం నుంచి 30 శాతానికి తగ్గించడానికి ఒప్పుకోవడంతోపాటు, చైనా కూడా యూఎస్ ఉత్పత్తులపై సుంకాన్ని 10 శాతానికి తగ్గించడానికి అంగీకరించింది. దీంతో గత నెల రోజులుగా ఇరు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధానికి బ్రేక్‌పడటంతో గ్లోబల్ ఇన్వెస్టర్లు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు, మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో బంగారం ధర రూ.3,932 లేదా 4.07 శాతం తగ్గి రూ.92,586గా నమోదైంది.