హైదరాబాద్, మార్చి 17: బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా..అయితే దుఖాణాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏటీఎంలలోనూ బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశం త్వరలో అందుబాటులోకి రాబోతున్నది. ఇందుకోసం గోల్డ్ సిక్కా అనే సంస్థ ప్రత్యేక గోల్డ్ ఏటీఎంను త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతున్నది. వచ్చే 45 రోజుల నుంచి 50 రోజుల్లో హైదరాబాద్‌లోని పాతబస్తి, సికింద్రాబాద్, అబిడ్స్‌లలో మూడు గోల్డ్ ఏటీఎంలను ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ ప్రమోటర్, సీఈవో సై తరూజ్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ గోల్డ్ ఏటీఎంల ఏర్పాటు చేయడానికి చెన్నైకు చెందిన టెక్నాలజీ సంస్థ తృణిక్స్ డాటావారే ఎల్ఎల్పీ, బ్యాంకింగ్ అవసరాల నిమిత్తం కేఎల్ హై-టెక్ సెక్యూర్ లిమిటెడ్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు చెప్పారు.
వచ్చే 50 రోజుల్లో అందుబాటులోకి రానున్న ఈ గోల్డ్ ఏటీఎంలతో సామాన్యుడు ఎప్పుడైన బంగారం కొనుగోలు చేయవచ్చునని చెప్పారు. కంపెనీ జారీ చేసిన ప్రీపెయిడ్ కార్డులతో 0.5 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు ఎంతైనా తీసుకోవచ్చును. వీటిలో పదిగ్రాముల వరకు నాణేల రూపంలో లభించనుండగా..మిగతా 20, 50, 100 గ్రాములు కలిగిన బార్ల రూపంలో లభించనున్నాయి. ఒక్కో ఏటీఎంలలో 5 కిలోల వరకు బంగారం ఉంటుందుని, అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న ధరలకు అనుగుణంగా ఈ ఏటీఎంల్లో ధరలు మారుతుంటాయని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక టెక్నాలజీని రూపొందిస్తున్నట్లు చెప్పారు.
ఏడాదిలోగా 3 వేల ఏటీఎంలు
ట్రయిల్ రన్లో భాగంగా తొలి విడుత హైదరాబాద్‌లో మూడు ఏటీఎంలను ప్రారంభిస్తున్న సంస్థ.. దశలవారీగా విస్తరించనున్నది. నెలకు 200 నుంచి 300 ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నది. వచ్చే ఏడాదిలోగా దేశంలో 3 వేల ఏటీఎంలను తేనున్నది. ఈ మేరకు ఏటీఎం తయారీ సంస్థలతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది.