Jana Nayagan | తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ నటుడిగా ప్రేక్షకుల ముందుకు రానున్న చివరి చిత్రం ‘జన నాయగన్’. రాజకీయాల్లో పూర్తిస్థాయిలో అడుగుపెట్టే ముందు ఆయన నటించిన ఈ సినిమాపై ప్రారంభం నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ కెరీర్‌కు గ్రాండ్ ఫేర్వెల్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు భావించారు. అయితే గత కొన్ని నెలలుగా వరుస వివాదాలు, న్యాయపరమైన సమస్యలు, సెన్సార్ ప్రక్రియలో ఎదురైన ఆటంకాల కారణంగా సినిమా విడుదల పదేపదే వాయిదా పడుతూ వస్తోంది.‘జన నాయగన్’ విడుదలకు సంబంధించిన వివాదం మద్రాస్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లడం పరిస్థితి ఎంత క్లిష్టంగా మారిందో చెప్పకనే చెబుతోంది.
పలు న్యాయపరమైన అంశాలు ఇంకా పరిష్కారం కాకపోవడంతో చిత్ర విడుదల తేదీపై ఇప్పటికీ అధికారిక స్పష్టత రాలేదు. దీంతో అభిమానులు మాత్రమే కాకుండా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక విజయ్ రాజకీయ జీవితంలో కీలక మలుపు తిరిగిన నేపథ్యంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ప్రభుత్వ పాలన, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపైనే పూర్తి దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సినిమా వివాదాలపై ఇప్పటివరకు ఆయన ఎలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయకపోయినా, చిత్ర విడుదల మరింత ఆలస్యమైతే డిస్ట్రిబ్యూటర్లకు నష్టపరిహారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ లేదా ప్రభుత్వ వర్గాల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
మరోవైపు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్న కె. వెంకట్ నారాయణకు విజయ్ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఆయనను ఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించడం రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఈ నియామకం తర్వాత ‘జన నాయగన్’ విడుదల ప్రక్రియ వేగం పుంజుకుంటుందా అనే చర్చ కూడా జరుగుతోంది. విజయ్ అభిమానుల దృష్టి మాత్రం ఇప్పుడు ఒక్క ప్రశ్నపైనే నిలిచింది. తన నట జీవితానికి ముగింపు పలికే ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని విజయ్ స్వయంగా ముందుండి థియేటర్లలోకి తీసుకువస్తారా? లేక న్యాయపరమైన సమస్యలు మరికొంత కాలం కొనసాగుతాయా? అనే సందేహం నెలకొంది. ఏళ్ల తరబడి తమిళ సినీ పరిశ్రమను తన స్టార్డమ్తో శాసించిన విజయ్‌కు ‘జన నాయగన్’ ఒక సాధారణ సినిమా కాదు. ఇది ఆయన నట జీవితానికి వీడ్కోలు పలికే చిత్రం కావడంతో అభిమానుల్లో భావోద్వేగ అనుబంధం కూడా ఎక్కువగానే ఉంది. అందుకే ఈ సినిమా విడుదలపై ప్రతి చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.