న్యూఢిల్లీ, జూన్ 16 : దేశీయ ప్రైమరీ మార్కెట్‌ను మందగమనం ఆవహించింది. ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా వచ్చిన పబ్లిక్ ఇష్యూల సంఖ్య 23 మాత్రమే మరి. అలాగే ఈ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)లతో దాదాపు గడిచిన 6 నెలల్లో సదరు కంపెనీలు సమీకరించిన నిధులు రూ.27,194 కోట్లేనని మంగళవారం ఈక్విరస్ క్యాపిటల్ విడుదల చేసిన ఓ నివేదిక చెప్తున్నది. అయితే గత ఏడాది 103 ఐపీవోలు రాగా.. మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో మదుపర్ల నుంచి రూ.1.76 లక్షల కోట్ల నిధులను ఆయా సంస్థలు సొంతం చేసుకోవడం గమనార్హం. కాగా, అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం ప్రభావం, తద్వారా భారతీయ స్టాక్ మార్కెట్లలో చోటుచేసుకున్న ఒడిదుడుకులు, ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన స్థూల అనిశ్చిత పరిస్థితులతో కంపెనీలు ఐపీవోల కోసం ముందుకు రాలేకపోయాయని ఈ రిపోర్టులో ఈక్విరస్ పేర్కొన్నది.
అన్నీ కుదిరితే ఈ ఏడాది దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశించాలని ఆయా రంగాల్లోని కంపెనీలు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. మే నెలనాటికి 236 ఐపీవో ప్రతిపాదనలు క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ గ్రీన్‌సిగ్నల్ కోసం వేచిచూస్తున్నాయి. ఇందులో 163 పరిశీలనల్ని పూర్తి చేసుకున్నట్టు ఈక్విరస్ ఈ సందర్భంగా తెలియజేసింది. అయితే ప్రస్తుతం నెలకొన్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల దృష్ట్యా కంపెనీలు నిధుల సమీకరణకు సంకోచిస్తున్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. దీంతో పరిస్థితులు చక్కబడేదాకా ప్రైమరీ మార్కెట్లో స్తబ్దత కొనసాగవచ్చని అభిప్రాయపడుతున్నారు. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరితే మార్కెట్లో ఉత్సాహం నెలకొనే వీలుందని చెప్తున్నారు. ఇప్పటికే ఆ జోష్ కనిపిస్తున్నది చూస్తూనే ఉన్నాం. అయితే ఇజ్రాయెల్ దూకుడుతో గల్ఫ్‌లో యుద్ధ వాతావరణం ఇప్పుడప్పుడే తొలగిపోకపోవచ్చన్న అనుమానాలూ ఉన్నాయి. ఈ క్రమంలోనే మెజారిటీ కంపెనీలు వేచిచూసే ధోరణిని అవలంబిస్తున్నాయన్నది విశ్లేషకుల మాట. మార్కెట్లు తిరిగి నష్టాల బాట పడితే తమ ఐపీవోలు ఆశించినంత విజయం సాధించవన్న భయాలు సంస్థల యాజమాన్యాలను వెంటాడుతున్నాయి మరి.
వచ్చే నెల జూలైలో దేశీయంగా అతిపెద్ద ఫండ్ కంపెనీ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ తమ పబ్లిక్ ఇష్యూను ప్రారంభించాలని చూస్తున్నట్టు సమాచారం. అలాగే క్విక్ కామర్స్ యూనికార్న్ జెప్టో కూడా రంగం సిద్ధం చేస్తున్నది. ఇక ఈ నెల 19న ఇన్సూర్టెక్ సంస్థ టర్టిల్‌మింట్ ఫిన్‌టెక్ సొల్యూషన్స్, 23న అద్విత్ జ్యుయెల్స్ ఐపీవోలకు రానున్నాయి. ఆ తర్వాత సీఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్, హెక్సగాన్ న్యూట్రీషన్, వాటర్‌వేస్ లీజర్ టూరిజం లిమిటెడ్ కంపెనీలూ క్యూ కడుతున్నాయి. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ).. ఈ వారం సెబీ వద్ద తమ ప్రిలిమినరీ పేపర్స్‌ను దాఖలు చేయవచ్చని తెలుస్తున్నది. ఇదిలావుంటే విదేశీ ఇన్వెస్టర్లు భారతీయ క్యాపిటల్ మార్కెట్లలో పెట్టుబడులకు సంశయిస్తున్నా.. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్)ల ద్వారా దేశీయ రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రం పెట్టుబడులకు ఆసక్తిని కనబరుస్తూనే ఉండటం కలిసొస్తున్నది. ఇటీవలికాలంలో నెలనెలా రూ.30,000కుపైగానే పెట్టుబడుల్ని పెడుతుండటం విశేషం.
