Nitin Gadkari – Water Taxi | దేశ ఆర్థిక రాజధాని ముంబై సబర్బన్ పరిధిలో సుమారు పదివేల వాటర్ టాక్సీలు అందుబాటులోకి రానున్నాయి. త్వరలో అందుబాటులోకి రానున్న నేవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానిస్తూ ముంబై సబర్బన్ ప్రాంతాల నుంచి ఈ వాటర్ టాక్సీలు నడిపే ప్రతిపాదనను కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీసుకొచ్చారు. ఈ విషయమై పడవల యజమానులతో చర్చించానని తెలిపారు.
మంగళవారం ముంబైలో జరిగిన ఐసీఈఆర్‌పీ2025 ఎగ్జిబిషన్లో గడర్కీ మాట్లాడుతూ నగర సబర్బన్ ప్రాంతాల నుంచి నేవీ ముంబై విమానాశ్రయానికి వాటర్ టాక్సీలు నడిపే అంశాన్ని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో చర్చించానని చెప్పారు. ముంబై నగరానికి ఉత్తరాన అరేబియా సముద్ర తీరాన గల విరార్, ఈశాన్య ప్రాంతంలోని ఠాణె క్రీక్ నుంచి విమాన ప్రయాణికులు నేవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి వాటర్ టాక్సీల్లో 70 నిమిషాల్లో చేరుకుంటారన్నారు. వాసాయి-విరార్, కల్యాణ్-డోంబివాలీ ప్రాంతాల నుంచి నూతన విమానాశ్రయానికి 70 నిమిషాల్లో చేరుకోవచ్చన్నారు. ఇందుకు పది వేల టాక్సీలు అవసరం అవుతాయన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి నేవీ ముంబై విమానాశ్రయ సేవలు ప్రారంభం అవుతాయి.