హైదరాబాద్: ది ఇండో-ఫ్రెంచ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (IFCCI) ఈ నెల 8న హైదరాబాద్‌లో కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి ఫ్రెంచ్ కంపెనీలకు చెందిన 100 మందికిపైగా సీఈవోలు, సీఎక్స్‌వోలు హాజరుకానున్నారు. మన రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో ఉన్న ఫ్రెంచ్ కంపెనీల పెట్టుబడులను ఈ సమావేశంలో ప్రదర్శించడంతోపాటు, మరిన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చేలా ప్రోత్సహించనున్నారు.
అంతేగాక, మంచి లొకేషన్, అనుకూలమైన వ్యాపార వాతావరణం, మౌలిక సదుపాయాలు, ప్రోత్సాహం అందించే పరిపాలన, అన్ని రకాలుగా అనుకూలమైన పర్యావరణ వ్యవస్థ కలిగిన తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన గమ్యస్థానంగా నిలబెట్టాలనే ఉద్దేశంతో IFCCI ఈ సమావేశాన్ని ఏర్పాటుచేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అనుకూలతలను ఇండో-ఫ్రెంచ్ వ్యాపార సముదాయానికి తెలియజేయమే ఎజెండాగా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే తెలంగాణలో విజయవంతంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న ఫ్రెంచ్ కంపెనీలు సఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్, సఫ్రాన్ ఎలక్ట్రికల్ & పవర్, మానే ఇండియాలకు సంబంధించిన సైట్లను వివిధ కంపెనీల ప్రతినిధి బృందాలు సందర్శించడం ద్వారా సమావేశం మొదలవుతుంది. ఈ సమావేశంలో భాగంగా జరిగే అధికారిక సెషన్‌కు ఫ్రెంచ్ రాయబారి ఎమ్మాన్యుయేల్ లెనైన్, తెలంగాణ ఐటీ, ఇతర శాఖల మంత్రి కేటీ రామారావు, ఆయన పరిధిలో వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీగా ఉన్న జయేష్ రంజన్, IFCCI అధ్యక్షుడు సుమిత్ ఆనంద్ పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమానికి దేశంలోని ఫ్రెంచ్ రాయబార కార్యాలయం, తెలంగాణ ప్రభుత్వం, CCEF – ఫ్రెంచ్ విదేశీ వాణిజ్య సలహాదారులతోపాటు CII, ఫ్రెంచ్ ఫ్యాబ్, బిజినెస్ ఫ్రాన్స్ మద్దతిస్తున్నాయి. ఈ IFCCI సమావేశాల్లో ఇది నాలుగో ఎడిషన్. తొలి మూడు ఎడిషన్లు నాగ్‌పూర్ (2018), గోవా (2019), తమిళనాడు (2021) రాష్ట్రాల్లో జరిగాయి.