FPI Investments | దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఈ నెలలో రూ.44,396 కోట్ల విలువైన షేర్లు విక్రయించారు. దేశీయంగా కార్పొరేట్ సంస్థల తృతీయ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు బలహీనంగా ఉంటాయన్న అంచనాల మధ్య అమెరికా డాలర్, యూఎస్ బాండ్లు బలోపేతం కావడంతో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు ఉపసంహరిస్తున్నారు. గత నెలలో రూ.15,446 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టారు. దేశీయ, అంతర్జాతీయ ఒడిదొడుకుల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీన పడింది.
మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఇండియా మేనేజర్ రీసెర్చ్- అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాత్సవ స్పందిస్తూ ‘ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ పతనం కొనసాగుతున్నా కొద్దీ దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు ఉపసంహరిస్తూనే ఉంటారు. ఆర్ధిక వృద్ధిరేటుపై అనిశ్చితి, బలహీన ఆర్థిక ఫలితాలు దీనికి దోహద పడతాయి’ అని వ్యాఖ్యానించారు. ఈ నెల 17 వరకూ ఎఫ్‌పీఐలు రూ.44,396 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఈ నెల రెండో తేదీ మినహా ఎఫ్‌పీఐలు నిత్యం ఈక్విటీ మార్కెట్లలో షేర్లు విక్రయిస్తూనే ఉన్నారు.
జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటర్జిస్ వీకే విజయకుమార్ మాట్లాడుతూ ‘అమెరికా డాలర్ బలోపేతం కావడం, యూఎస్ బాండ్ల విలువ పెరగడం వల్ల ఎఫ్‌పీఐలు నిత్యం ఈక్విటీ మార్కెట్లలో వాటాలను విక్రయించడానికి కారణం. యూఎస్ డాలర్ ఇండెక్స్ 109 ఎగువన, పదేండ్ల గడువు గల యూఎస్ బాండ్ల విలువ 4.6 శాతం వృద్ధి చెందడం వల్లే భారత్ వంటి అత్యంత ఖర్చుతో కూడుకున్న మార్కెట్ నుంచి ఎఫ్‌పీఐలు వాటాలను ఉపసంహరించడానికి కారణం’ అని చెప్పారు. యూఎస్ బాండ్లు ఆకర్షణీయంగా ఉండటంతో డెట్ మార్కెట్ నుంచి కూడా ఎఫ్‌పీఐలు నిధులు ఉపసంహరిస్తున్నారు. డెట్ మార్కెట్లో సాధారణ పరిమితి రూ.6,176 కోట్ల నుంచి ఎఫ్‌పీఐలు రూ. 4,848 కోట్లు ఉపసంహరించారు.
దేశీయంగా వినియోగం వృద్ధి చెందడంతోపాటు మౌలిక వసతుల ప్రాజెక్టులపై పెరుగుతున్న పెట్టుబడులు, జీడీపీ వృద్ధి, కార్పొరేట్ త్రైమాసిక ఆర్థిక ఫలితాల్లో వృద్ధి ఉంటే దేశీయ మార్కెట్లోకి ఎఫ్‌పీఐ పెట్టుబడులు వస్తాయని వాటర్ ఫీల్డ్ అడ్వైజర్స్ లిస్టెడ్ ఇన్వెస్ట్మెంట్స్ సీనియర్ డైరెక్టర్ విపుల్ భోవర్ అంచనా వేశారు. విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ మార్కెట్లలో పెట్టుబడులపై ఆచితూచి స్పందించే వైఖరి అనుసరిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ కేవలం రూ.427 కోట్ల విదేశీ పెట్టుబడులు మాత్రమే వచ్చాయి. గతేడాది రూ.1.71లక్షల కోట్ల ఎఫ్‌పీఐ పెట్టుబడులు వచ్చాయి. అమెరికా, బ్రిటన్, ఈయూ వంటి కేంద్రీయ బ్యాంకులు వడ్డీరేట్లు పెంచిన 2022లో దేశీయ మార్కెట్ల నుంచి రూ.1.21లక్షల కోట్ల పెట్టుబడులను ఎఫ్‌పీఐలు ఉపసంహరించారు.