న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: విదేశీ మారకం నిల్వలు అంతకంతకు ఆవిరైపోతున్నాయి. ఫారెక్స్ రిజర్వుల పతనానికి అడ్డుకట్ట వేయడానికి రిజర్వుబ్యాంక్ చేసిన ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. వరుసగా మూడు వారాలుగా తగ్గుతూ వచ్చిన నిల్వలు ఫిబ్రవరి 17తో ముగిసిన వారాంతం నాటికి మరో 5.68 బిలియన్ డాలర్లు కరిగిపోయి 561.267 బిలియన్ డాలర్లకు జారుకున్నాయి. 11 వారాల కనిష్ఠ స్థాయికి జారుకున్నట్లు రిజర్వు బ్యాంక్ విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది. అంతక్రితం వారంలోనూ రిజర్వులు 8.319 బిలియన్ డాలర్లు తరిగిపోయిన విషయం తెలిసిందే. అక్టోబర్ 2021లో ఫారెక్స్ రిజర్వులు గరిష్ఠ స్థాయి 645 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి బలహీనపడటం, విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తులు అంతకంతకు తగ్గడం ఇందుకు కారణమని సెంట్రల్ బ్యాంక్ విశ్లేషించింది.
పసిడి రిజర్వులు కూడా..
అంతర్జాతీయ కరెన్సీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనుకావడంతో దేశీయ ఫారెక్స్ రిజర్వులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నదని విశ్లేషకులు అంటున్నారు. దీంతోపాటు ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరిస్తున్న అమెరికా కరెన్సీ డాలర్‌కు అనూహ్యంగా మద్దతు లభించడంతో ఇతర కరెన్సీలు తీవ్ర ఆటుపోటులకు గురవుతున్నాయి. ఈ నెల 17తో ముగిసిన వారంలోనూ విదేశీ మారకం రూపంలోవున్న ఆస్తుల విలువ 4.515 బిలియన్ డాలర్లు తగ్గి 496.072 బిలియన్ డాలర్లకు పడిపోవడం ఇందుకు కారణమని విశ్లేషించింది. డాలర్ బలపడటం, ఇదే సమయంలో యూరో, పౌండ్, యెన్లు పతనంకావడం ఫారిన్ ఎక్సేంజ్ రిజర్వులపై ప్రభావం పడిందని పేర్కోంది. అలాగే పసిడి రిజర్వులు కూడా వరుసగా మూడోవారం 1.045 బిలియన్ డాలర్లు తరిగిపోయి 41.817 బిలియన్ డాలర్లకు తగ్గాయి.