హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇప్పటికే పలు స్టార్టప్‌లో జాతీయ స్థాయిలో సత్తా చాటగా..తాజాగా మరో ఐదు స్టార్టప్‌లు ఇందుకు సిద్ధమయ్యాయి. దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా ఈ నెల 28 నుంచి డిసెంబర్ 2 వరకు జరగనున్న ప్రతిష్ఠాత్మక కార్యక్రమం ‘పీపుల్స్ ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్స్(పీఎఫ్ఐ 2023)లో ప్రదర్శించేందుకుగాను గ్రామీణ ప్రాంతాలకు చెందిన 5 స్టార్టప్‌లు ఎంపికయ్యాయి. గ్రామీణ ఆవిష్కర్తలను ప్రోత్సహించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్(టీఎస్ఐసీ) విసృతంగా చేపట్టిన కార్యక్రమాల వల్లనే దేశీయ స్థాయిలో ప్రదర్శించడానికి సిద్ధమయ్యాయని టీఎస్ఐసీ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంత తౌటం తెలిపారు.