హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో చిన్న తరహా ఖనిజాల మొదటి దశ వేలం విజయవంతంగా పూర్తయినట్టు గనుల శాఖ ప్రకటించింది. దీనిలో భాగంగా మూడు ఖనిజాలకు సంబంధించిన 25 బ్లాకుల్లో 19 బ్లాకులకు ఈ నెల 23 నుంచి 27 వరకు నిర్వహించిన ఆన్లైన్ వేలంలో రూ.56.74 కోట్లకు బిడ్లు దాఖలైనట్టు వెల్లడించింది.
వీటిలో ఓ కలర్ గ్రానైట్ బ్లాక్ (3.61 హెక్టార్లు)తోపాటు 4 లాటరైట్ బ్లాకులు (15.834 హెక్టార్లు), 14 స్టోన్ అండ్ మెటల్ బ్లాకులు (47.125 హెకార్లు) ఉన్నట్టు వివరించింది. వీటి రిజర్వు ధర రూ.5,63,62,600గా నిర్ణయించగా.. తుది బిడ్ మొత్తం రూ.56,74,12,600గా ఉన్నట్టు తెలిపింది. మొత్తం 179 బిడ్లు దాఖలైనట్టు పేర్కొన్నది. ఇక ప్రతినెలా ఖనిజాల వేలం నిర్వహించాలని భావిస్తున్నది.