IRDAI : ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) దేశంలోని అన్ని పబ్లిక్, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలను మానిటర్ చేస్తుంది. ఆయా ఇన్సూరెన్స్ కంపెనీలు నియమాలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటుంది. తాజాగా ఈ సంస్థ ఎస్బీఐ అనుబంధ ‘ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్’ కంపెనీకి షాకిచ్చింది. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కొన్ని నియమాలు ఉల్లంఘించినట్లు తేలడంతో ఐఆర్డీఏఐ భారీ జరిమానా విధించింది.
పాలసీబజార్, ఎంఐసీ ఇన్సూరెన్స్, కంపేర్ పాలసీ, ఈజీ పాలసీ, విష్ఫిన్ వంటి ఇన్సూరెన్స్ వెబ్ అగ్రిగేటర్లతో కంపెనీ పని చేస్తున్న విధానంలో అనేక సమస్యలను ఐఆర్డీఏఐ గుర్తించింది. ఇన్సూరెన్స్ వెబ్ అగ్రిగేటర్స్, అవుట్సోర్సింగ్ పద్ధతుల్లో ఉల్లంఘనలకు పాల్పడినందుకు రూ.1 కోటి పెనాల్టీ విధించింది. ఎస్బీఐ లైఫ్ వెబ్ అగ్రిగేటర్లు అందించే సేవలను స్పష్టంగా పేర్కొనలేదు. వారికి ఎంత చెల్లించిందో వెల్లడించలేదు.
కంపెనీ 2018, 2019 ఆర్థిక సంవత్సరాల్లో ఎక్స్టెంట్ మార్కెటింగ్ అండ్ టెక్నాలజీస్ అనే విక్రేతకు రూ.1.93 కోట్ల విలువైన చెల్లింపులు చేసింది. అయితే చట్ట ప్రకారం ఈ చెల్లింపులను IRDAI కి రిపోర్ట్ చేయలేదు. విస్తారమైన మార్కెటింగ్ బాధ్యతలను నిర్వహించడానికి తగినంత మౌలిక సదుపాయాలను కలిగి లేదు. థర్డ్ పార్టీలపై ఎక్కువగా ఆధారపడింది. వాస్తవానికి రెవెన్యూలో 95% ఇతర కంపెనీలకు బదిలీ అయింది.
ఎస్బీఐ లైఫ్ తన ఔట్సోర్సింగ్ పార్ట్‌నర్స్‌తో చేసుకున్న ఒప్పందాల్లో పారదర్శకత లేదని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ గుర్తించింది. వెబ్ అగ్రిగేటర్లకు ఎస్బీఐ లైఫ్ చాలా ఎక్కువ ఫీజులు చెల్లించినట్లు కూడా ఐఆర్డీఏఐ తేల్చింది. ఇకపై IRDAI నిబంధనలను అనుసరించే కొత్త, సమగ్రమైన అవుట్సోర్సింగ్ విధానాన్ని అభివృద్ధి చేయాలని ఎస్బీఐ లైఫ్‌ను ఆదేశించింది. కంపెనీ తప్పనిసరిగా IRDAI కనుగొన్న లోపాలను డైరెక్టర్ల బోర్డుకు సమర్పించాలని సూచించింది.
ఎస్బీఐ లైఫ్ డెత్ క్లెయిమ్‌లను ఎలా హ్యాండిల్ చేసిందనే విషయంలో కూడా IRDAI సమస్యలను గుర్తించింది. నిర్దిష్టంగా కంపెనీ 21 క్లెయిమ్‌లను తిరస్కరించింది. సమాచారాన్ని బహిర్గతం చేయకపోవడం లేదా పాలసీ జారీ చేసిన మూడు సంవత్సరాలలోపు మరణం సంభవించడం కారణాలుగా చూపింది. అయితే ఈ పాలసీ రిజెక్షన్లను సమర్థించేందుకు తగిన ఆధారాలను ఎస్బీఐ లైఫ్ అందించలేదని IRDAI నిర్ధారించింది.
రెగ్యులేటర్.. ఎస్బీఐ లైఫ్‌కు ఇన్సూరెన్స్ యాక్ట్ 1938లోని సెక్షన్ 45కి కట్టుబడి ఉండాల్సిన ప్రాముఖ్యతను గుర్తుచేసింది. ఈ సెక్షన్ మూడు సంవత్సరాల పాటు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అమల్లో ఉన్న తర్వాత, దాన్ని కంపెనీ సవాలు చేయలేదు లేదా కంటెస్ట్ చేయలేదు. ఈ మూడేళ్ల వ్యవధి పాలసీ జారీ అయిన తేదీ నుంచి ప్రారంభమవుతుంది. విచారణ సమయంలో ఎస్బీఐ లైఫ్ 86 క్లెయిమ్‌లను పరిష్కరించింది. మొత్తం రూ.10.21 కోట్లు చెల్లించింది. ఇందులో రూ.5.78 కోట్లు సెటిల్మెంట్లు, రూ.4.43 కోట్లు జరిమానా వడ్డీ ఉన్నాయి.
IRDAI గుర్తించిన మరో సమస్య ఏమిటంటే.. ఎస్బీఐ లైఫ్ కొన్ని ప్రొడక్టులను అధికారికంగా విత్‌డ్రా చేసుకొన్న తర్వాత కూడా ఇన్సూరెన్స్ పాలసీలు జారీ చేసింది. కొన్ని ప్రొడక్టులను ముందుగానే లాంచ్ చేసింది. విత్‌డ్రా డేట్ తర్వాత ప్రపోజల్ ఫామ్స్ నింపి, పాలసీలను జారీ చేసిన సందర్భాలు ఏడు ఉన్నాయి. అయితే ఇకపై ఇలా జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఎస్బీఐ లైఫ్ ఓ ప్రకటనలో స్పష్టంచేసింది.