శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Business - Feb 17, 2020 , 00:38:22

పొదుపుపై బడ్జెట్‌ పిడుగు

పొదుపుపై బడ్జెట్‌ పిడుగు
  • కొత్త పన్ను విధానం నష్టమేనంటున్న నిపుణులు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: కొత్త పన్ను విధానం.. పొదుపును ప్రభావితం చేస్తున్నదని నిపుణులు అంటున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను ఈ నెల 1న పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వ్యక్తిగత ఆదాయం పన్ను (ఐటీ)కు సంబంధించి కొత్త పన్ను విధానాన్ని పరిచయం చేసిన సంగతి విదితమే. ఈ కొత్త విధానంతోపాటు ఇప్పుడున్న విధానం కూడా అమల్లో ఉంటుందన్న కేంద్రం.. పన్ను చెల్లింపుదారులు తమకు ఇష్టమైన పన్ను నిర్మాణాన్ని ఎంచుకోవచ్చని అవకాశమిచ్చింది. అయితే కొత్త పన్ను విధానంలో మినహాయింపులు, కోతలు లేకుండా ఉండటంతో దానివల్ల పొదుపు ప్రయోజనాలు దెబ్బతింటాయని నిపుణులు అంటున్నారు. 


ఈ విధానంలో పన్ను రేట్లు తక్కువగా ఉన్నా.. వివిధ రకాల మినహాయింపులు, తగ్గింపులు ఏమీ లేవని చెబుతున్నారు. దీనివల్ల దేశంలో సేవింగ్స్‌పై తీవ్ర ప్రభావం పడుతుందని స్పష్టం చేస్తున్నారు. పలు రకాల సేవింగ్స్‌పై ఇప్పుడు పన్ను మినహాయింపులున్నాయని, దాంతో అంతా సదరు సేవింగ్స్‌ వైపునకు వెళ్తున్నారని, కొత్త పన్ను విధానంలో ఈ తరహా మినహాయింపులు లేనందున సేవింగ్స్‌ను అదనపు భారంగా అంతా అనుకునే ప్రమాదం ఉందని వివరిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వానికి ఆదాయం పెరిగినా.. వ్యక్తుల పొదుపు అవకాశాలు సన్నగిల్లుతాయని పేర్కొంటున్నారు. 


తగ్గుతున్న పొదుపు రేటు

ఇప్పటికే గత ఆరేండ్లుగా పొదుపు రేటు తగ్గుతూ వస్తున్నదని, కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటే.. ఈ రేటు మరింత పడిపోయే వీలుందని ఎన్‌ఐపీఎఫ్‌పీ ప్రొఫెసర్‌ ఎన్‌ఆర్‌ భానుమూర్తి పీటీఐతో అన్నారు. దేశంలో పొదుపు రేటు 2012లో దాదాపు 36 శాతంగా ఉంటే, ఇప్పుడది 30 శాతానికి దిగజారిందని తెలిపారు. జేఎన్‌యూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ రోహిత్‌ ఆజాద్‌, కేంద్ర మాజీ మంత్రి యోగిందర్‌ అలగ్‌ కూడా ఇదే తరహా అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. సేవింగ్స్‌ ప్రోత్సాహకాలను తగ్గించడమేనని ఆందోళన వెలిబుచ్చారు. మార్కెట్‌లో డిమాండ్‌ను పెంచడంపైనే ప్రభుత్వం దృష్టి పెడుతున్నదని, సేవింగ్స్‌ కూడా ముఖ్యమేనని మరికొందరు నిపుణులు గుర్తుచేస్తున్నారు. 


కొత్త పన్ను విధానంలోకి 80 శాతం మంది పన్ను చెల్లింపుదారులు మారే వీలుందని రెవిన్యూ కార్యదర్శి అజయ్‌ భూషణ్‌ పాండే అంచనా వేస్తుండటం గమనార్హం. కొత్త పన్ను ప్రతిపాదనలో రూ.2.5 లక్షల వార్షిక ఆదాయం వరకు ఎలాంటి పన్నులు లేవు. రూ.2.5 లక్షల నుంచి 5 లక్షలదాకా 5 శాతం పన్నుంటుంది. అలాగే రూ.5 లక్షల నుంచి 7.5 లక్షల వరకు 10 శాతం, రూ.7.5 లక్షల నుంచి 10 లక్షలదాకా 15 శాతం పన్ను పడుతుంది. ఇక రూ.10 లక్షల నుంచి 12.5 లక్షల వరకు 20 శాతం, రూ.12.5 లక్షల నుంచి 15 లక్షలదాకా 25 శాతం, ఆపైన 30 శాతంగా పన్నులున్నాయి.


logo