EPFO-Higher Pension | ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తన పరిధిలోకి వచ్చే ప్రైవేట్ సంస్థల ఉద్యోగుల అధిక పెన్షన్ (Higher Pension) కోసం ఉమ్మడి ఆప్షన్ దరఖాస్తు గడువు మళ్లీ పొడిగించింది. ఇంతకుముందు ఇచ్చిన గడువు ఈనెల 26తో ముగియనుండటంతో వచ్చేనెల (జూలై) 11 వరకు పొడిగించినట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది. అనధికార వర్గాల కథనం ప్రకారం మూడు నెలల గడువు పొడిగించినట్లు సమాచారం.
దీంతో ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్న వేతన జీవులు అధిక పెన్షన్ కోసం ఆన్లైన్లో ఉమ్మడి ఆప్షన్ దరఖాస్తు చేయడానికి వీలు కలిగింది. గత నెల మూడో తేదీతో ఆన్ లైన్ దరఖాస్తు గడువు ముగిసినప్పుడు కూడా ఈ నెల 26 వరకు ఈపీఎఫ్ఓ పొడిగించిన సంగతి తెలిపిందే.ఆన్ లైన్ దరఖాస్తు నింపడానికి సాంకేతిక అడ్డంకులు, ఖచ్చితంగా జత చేయాల్సిన ఈపీఎఫ్ఓ పాస్‌బుక్ డౌన్ లోడ్ చేసుకోవడానికి సర్వర్ మొరాయించడం వంటి తదితర సమస్యలు అర్హులైన పెన్షన్ దారులు, కార్మికులు, ఉద్యోగులు దరఖాస్తు చేసుకోలేకపోయారు.
ఈ నేపథ్యంలో అధిక పెన్షన్ దరఖాస్తు గడువు పొడిగించాలంటూ ఈపీఎఫ్ఓ కమిషనర్‌కు పెన్షనర్లు, కార్మిక సంఘాల నేతలు, కార్మికులు, వేతన జీవులు, సీబీటీ సభ్యులు గతంలోనే విజ్శప్తి చేశారు. దీంతో గత నెల మూడో తేదీ నుంచి జూన్ 26 వరకు గడువు పొడిగించారు. తాజాగా మరోమారు పొడిగించడంతో ఇప్పటి వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోని వారికి మరో అవకాశం కల్పించినట్లయింది.