న్యూఢిల్లీ, మార్చి 7: వాస్తవ వేతనంపై పీఎఫ్ చెల్లింపులు చేసిన వారికి అధిక పెన్షన్ ఇవ్వాలంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత వేతన జీవులపై ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) వరుస పిడుగులు వేస్తున్నది. ఎనిమిదేండ్ల క్రితమే పదవీ విరమణ చేసి, సుప్రీం తీర్పుతో ఎక్కువ పెన్షన్ వస్తుందన్న వస్తుందన్న వృద్ధ ఆశాజీవులనూ సంస్థ వదలడం లేదు. 2014 సెప్టెంబర్ 1కంటే ముందు రిటైర్ అయినవారిలో అధిక శాతంమందిని ఎక్కువ పెన్షన్‌కు అనర్హులను చేసే రీతిలో ఉన్న నిబంధనలు తాజాగా బయటపడ్డాయి. సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి 2014 సెప్టెంబర్ కంటే ముందు పదవీ విరమణ చేసినవారు అధిక పెన్షన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి ఈ మార్చి 4 గడువుతేదీ కాగా, ఈ తేదీనాటికి 91,259 ఆన్లైన్ అప్లికేషన్లు వచ్చినట్టు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ రెండు రోజుల క్రితం ప్రకటించింది. వీరిలో ఎక్కువ మంది అధిక పెన్షన్‌కు అనర్హుల వుతారని నిపుణులు అంటున్నారు. ఈ మేరకు సమాచార హక్కు చట్టం కింద ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియాకు లభించిన సమాచారంలో విస్తుపోయే వాస్తవం వెల్లడయ్యింది. అది ఏమిటంటే..
అధిక పెన్షన్‌ను కోరుతూ 90,000కుపైగా దరఖాస్తులు వచ్చాయంటూ ఈపీఎఫ్‌వో చెపుతున్నది. 2004 డిసెంబర్ 1-2017 మార్చి 23 మధ్యలో పదవీ విరమణ చేసినవారు సర్వీసులో ఉండగా, అప్పుడు అధిక పెన్షన్‌కు ఉమ్మడి ఆప్షన్ దరఖాస్తులు అనుమతించనందున, వారిలో చాలా మంది ఇప్పుడు దరఖాస్తు పెట్టుకున్నారు. వాస్తవ జీతంపై ఈపీఎఫ్‌వోకు చెల్లింపులు చేసిన అర్హులైన వారందరికీ అధిక పెన్షన్ వర్తింపచేసేందుకు 2004 డిసెంబర్ 1 తేదీని సంస్థ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా, 2014 సెప్టెంబర్ 1 తర్వాత రిటైర్ అయిన ఈపీఎస్ సభ్యులు ఉమ్మడి ఆప్షన్ ఫారంను సమర్పించేందుకు ప్రస్తుతం యూనీఫైడ్ పోర్టల్‌లో అవకాశం ఉంది. వీరు అధిక పెన్షన్‌కు దరఖాస్తు చేయడానికి ఈపీఎఫ్‌వో మే 3 వరకూ గడువును పొడిగించింది.