Artificial Intelligence | దేశంలోని కార్పొరేట్ సంస్థలు కొత్త ఉద్యోగాల నియామకంలో ఆచితూచి స్పందిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతుల కోసం 53 శాతం డిమాండ్ ఉన్నా, దేశీయంగా 80 శాతం కంపెనీలు కొత్త ఉద్యోగాల నియామకంలో ప్రతిభావంతులైన నిపుణుల కొరతను ఎదుర్కొంటున్నాయి. 2022 నుంచి ప్రపంచ సగటు 74 శాతానికి పైగా నిపుణుల కొరత సమస్యతో భారతీయ కంపెనీలు సతమతం అవుతున్నాయని మాన్పవర్ గ్రూప్ నిర్వహించిన ‘ప్రతిభావంతుల కొరతపై అధ్యయనం’లో తేలింది.
దేశంలోని నాలుగు రీజియన్ల పరిధిలో మూడు వేల సంస్థల నుంచి సేకరించిన డేటా ఆధారంగా మాన్పవర్ గ్రూప్ అధ్యయనం జరిపింది. ఈ ఏడాది తమ అవసరాలకు సరిపడా నిపుణుల కోసం 80శాతం కంపెనీలు కష్ట పడుతున్నాయి. ప్రత్యేకించి దక్షిణ భారతంలో నిపుణుల కొరత 85శాతం వరకూ ఉంది. దీనిపై తక్షణం ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందని మాన్పవర్ గ్రూప్ ఇండియా అండ్ మిడిల్ఈస్ట్ ఎండీ సందీప్ గులాటీ చెప్పారు.
ఐటీ, ఇంధన రంగం, యుటిలిటీస్ పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రత్యేకించి ఐటీ రంగంలో స్పెషలైజ్డ్ నైపుణ్యం గల వారికోసం డిమాండ్ ఎక్కువగా ఉంది. కొరతను పరిష్కరించుకోవడానికి ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగుల్లో 39 శాతం మందికి రీస్కిలింగ్ అవకాశాలు కల్పిస్తున్నాయని ఐటీ కంపెనీలు. దీంతో రిక్రూట్మెంట్ ఖర్చులు తగ్గించుకోవడంతోపాటు అంతర్గత శక్తి సామర్థ్యాలను ప్రోత్సహిస్తున్నాయి.
కేవలం 22శాతం కంపెనీలు మాత్రమే 38 శాతం కొత్త ఉద్యోగుల నియామకానికి, ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగుల్లో 29 శాతం మందికి వేతనాలు పెంచుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో నైపుణ్యం ఉన్న వారి కోసం యాజమాన్యాలు ఆరా తీస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో శిక్షణ ఇవ్వడంతోపాటు ప్రతిభావంతులకు (హైబ్రీడ్, రిమోట్) లొకేషన్ ఫ్లెక్సిబిలిటీ అవకాశాలు కల్పిస్తున్నాయి.