న్యూఢిల్లీ, అక్టోబర్ 28 : టాటా ట్రస్ట్స్‌లో మళ్లీ విభేదాలు భగ్గుమన్నాయి. టాటా ట్రస్ట్స్ చైర్మన్ నియోల్ టాటా, మరో ఇద్దరు ట్రస్టీలు.. ట్రస్టీగా మెహ్లీ మిస్త్రీ పునర్నియామకాన్ని గట్టిగా అడ్డుకుంటున్నారు మరి. గత ఏడాది రతన్ టాటా మరణంతో టాటా ట్రస్ట్స్ చైర్మన్‌గా నియోల్ టాటా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే టాటా ట్రస్ట్స్ బోర్డులో గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి.
ట్రస్టీగా మెహ్లీ మిస్త్రీ మూడేండ్ల పదవీకాలం ముగుస్తుండటంతో ఆయన పునర్నియామకాన్ని నియోల్ టాటాతోపాటు ఆయనకు సన్నిహితులుగా పేరున్న ట్రస్టీలు టీవీఎస్ మోటర్ కంపెనీ చైర్మన్ ఎమిరేట్స్ వేణు శ్రీనివాసన్, రక్షణ శాఖ మాజీ కార్యదర్శి విజయ్ సింగ్ మంగళవారం వ్యతిరేకించినట్టు సమాచారం. ఇదే సమయంలో సిటిబ్యాంక్ ఇండియా మాజీ సీఈవో ప్రమిత్ ఝవేరి, ముంబైకి చెందిన న్యాయవాది డారియస్ ఖంబాట, పుణెకు చెందిన ఫిలంత్రోఫిస్ట్ జహంగీర్ హెచ్‌సీ జహంగీర్లు మిస్త్రీకి మద్దతు పలికారు. వీరంతా బోర్డులో మిస్త్రీ వర్గంగా ముద్రపడ్డారు.