Direct Tax Collections | ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 19.54 శాతం పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి త్రైమాసికంలో కార్పొరేట్లు రూ.57.4 లక్షల కోట్ల హయ్యర్ అడ్వాన్స్ టాక్స్ చెల్లించారని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) అధికారులు తెలిపారు. గత నెల 15 నాటికి కార్పొరేట్ల అడ్వాన్స్ టాక్స్ తొలి విడుత చెల్లింపులు 27.34 శాతం పెరిగి రూ.1.48 లక్షల కోట్లకు చేరాయి. ఇందులో రూ.1.14 లక్షల కోట్ల కార్పొరేట్ ఇన్కం టాక్స్ (సీఐఐ), రూ.34,470 కోట్ల పర్సనల్ ఇన్కం టాక్స్ (పీఐటీ) కూడా ఉంది.
ఈ నెల 11 నాటికి నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.5,74,357 కోట్లకు చేరుకున్నాయి. ఇందులో కార్పొరేట్ ఇన్ కం టాక్స్ (సీఐటీ) రూ.2,10,274 కోట్లు, వ్యక్తిగత ఆదాయం పన్ను (పీఐటీ) రూ.3,46,036 కోట్లు ఉంటుందని శనివారం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది. ప్రత్యక్ష పన్ను వసూళ్లలో రూ.16,634 కోట్ల సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (ఎస్టీటీ) కూడా ఉందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఇదే కాలానికి నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.4,80,458 కోట్లకు చేరాయని సీబీడీటీ తెలిపింది.
కాగా, ఈ నెల 11 నాటికి రూ.70,902 కోట్ల మేరకు పన్ను చెల్లింపుదారులకు రీఫండ్ చేసినట్లు తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో రీఫండ్స్ 64.4 శాతం పెరిగాయి. గత ఏప్రిల్ నుంచి జూలై 11 నాటికి స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.6.45 లక్షల కోట్లకు చేరాయి. గతేడాది రూ.5.23 లక్షల కోట్లకే పరిమితం అయ్యాయి. దీని ప్రకారం 2023-24తో పోలిస్తే 2024-25లో స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 23.24 శాతం గ్రోత్ నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.21.99 లక్షల కోట్ల నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు చేపట్టాలని గత ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.