Ram Mandir | సోమవారం అయోధ్యలో రామ మందిరం ప్రారంభం కోసం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ మీట్ మర్చంట్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకున్నది. రామ మందిర ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో ఈ నెల 22న అన్ని మీట్, ఫిస్ దుకాణాలు మూసివేయాలని ఢిల్లీ మీట్ మర్చంట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఇర్షాద్ ఖురేషీ కోరారు. ఇరు సామాజిక వర్గాల మధ్య ఐక్యత, సామరస్యాన్ని ప్రోత్సహించడానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
అయోధ్యలో రామాలయ `ప్రాణప్రతిష్ట` వేడుక నేపథ్యంలో ప్రజల మనోభావాలను గౌరవిస్తూ మీట్, ఫిష్ విక్రయ దుకాణాలను మూసివేయడంతోపాటు వధశాలలను కూడా మూసేయాలని ఇర్షాద్ ఖురేషీ కోరారు. రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా హిందూ సోదర సోదరీమణుల సంబురాలను గౌరవిస్తూ అన్ని వధశాలలు, మీట్, ఫిష్ విక్రేతలను దుకాణాలు మూసేయాలని కోరామన్నారు. ఇరు పక్షాల మనోభావాలను గౌరవించాల్సిందేనని, ఒక రోజు దుకాణాలు మూసేసినంత మాత్రాన వారి వ్యాపారంపై ప్రభావం చూపదని చెప్పారు.
ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్ పరిధిలోని పలు రెస్టారెంట్లు ఈ నెల 22న తమ కస్టమర్లకు నాన్-వెజ్ వంటకాలు వడ్డించబోమని ప్రకటించాయి. అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ట నేపథ్యంలో కన్నాట్‌ప్లేస్‌లోని పలు రెస్టారెంట్లు తమ కస్టమర్లకు శాఖాహార భోజనం మాత్రమే వడ్డించాలని ప్రతిజ్ఞ చేశాయని న్యూఢిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్ (ఎన్డీటీఏ) సంయుక్త కార్యదర్శి అమిత్ గుప్తా తెలిపారు.