న్యూఢిల్లీ, మే 14: డీ-మార్ట్ పేరుతో రిటైల్ అవుట్లెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్ లిమిటెడ్ ఆర్థిక ఫలితాలు విశ్లేషకుల అంచనాలకు అందుకోలేకపోయింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.426.75 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.413.87 కోట్లతో పోలిస్తే 3.11 శాతం అధికం.
సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 18.55 శాతం ఎగబాకి రూ.8,786.45 కోట్లుగా నమోదైంది. నిర్వహణ ఖర్చులు 18.71 శాతం పెరిగి రూ.8,210.13 కోట్లకు చేరుకున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.30,976.27 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.1,492.40 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. ప్రస్తుతం సంస్థకు 284 స్టోర్లు ఉన్నాయి.