న్యూఢిల్లీ, మే 7 : టెక్నాలజీ దిగ్గజం క్వాల్కామ్.. మధ్య శ్రేణి ప్రీమియం, దిగువ శ్రేణిలో మొబైల్ ఫోన్ల కోసం కొత్త తరం చిప్సెట్లను తీసుకొచ్చింది. పెరుగుతున్న ఫోన్ల ధరలపై ఆందోళనల నేపథ్యంలో ఈ నయా చిప్‌లు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. కాగా, స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5, స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 5 చిప్సెట్లు.. బ్యాటరీ లైఫ్‌ను పెంచుతాయని, మొబైల్ పనితీరును మెరుగుపరుస్తాయని, అడ్వాన్స్ కనెక్టివిటీకి మద్దతిస్తాయని క్వాల్కామ్ టెక్నాలజీస్ సీనియర్ ఉపాధ్యక్షుడు క్రిస్ పాట్రిక్ తెలిపారు. ‘చిప్‌ల సరఫరా పరిమితమైంది.
డివైజ్‌ల విలువ పెరిగిపోతున్నది. ఈ తరుణంలో యూజర్ల అవసరాలకు తగ్గట్టుగా అందుబాటు ధరల్లో ఏఐ వినియోగానికి సరిపడే చిప్సెట్లను మొబైల్ తయారీ కంపెనీల కోసం ఆవిష్కరించాం’ అని ఈ సందర్భంగా తెలిపారు. కెమెరా, గేమింగ్ ఎక్స్పీరియన్స్ మొదలగునవి బాగుంటాయన్నారు. మొత్తానికి చైనా స్మార్ట్ఫోన్ల తయారీదారులు ఒప్పో, రియల్మీ, షియామీ తదితర సంస్థలతో క్వాల్కామ్ ఒప్పందాలు కుదుర్చుకున్న నేపథ్యంలో ఈ ఆధునిక చిప్‌లతో కొత్త మాడళ్ల రేట్లు తగ్గొచ్చు అంటున్నారు.