Crypto’s Slump | ఒకనాడు మోడ్రన్ గోల్డ్ అవతార్‌గా పేరొందాయి క్రిప్టో కరెన్సీలు.. కానీ వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలకు పెనుముప్పుగా మారాయని ఆయా దేశాల అధినేతలు ప్రకటించారు. అంతేకాదు వాటి కట్టడికి కొన్ని చర్యలు తీసుకున్నారు. ఫలితంగా కొంత కాలంగా క్రిప్టో కరెన్సీలో భారీ నష్టాలను మూట గట్టుకుంటున్నాయి. తాజాగా సోమవారం క్రిప్టో కరెన్సీల మార్కెట్ క్యాపిటలైజేషన్ లక్ష కోట్ల డాలర్ల దిగువకు పడిపోయింది. 2021 జనవరి నుంచి క్రిప్టో మార్కెట్ క్యాపిటైలజేషన్ లక్ష కోట్ల డాలర్లకు దిగువన 926 బిలియన్ డాలర్లకు పతనం కావడం ఇదే తొలిసారి.
క్రిప్టో మేజర్‌గా పేర్కొందిన బిట్‌కాయిన్ సోమవారం ట్రేడింగ్‌లో తొమ్మిది శాతానికి పైగా నష్టపోయింది. ఫలితంగా 18 నెలల కనిష్ఠం 23,950 డాలర్లకు చేరుకున్నది. మార్కెట్లో ప్రస్తుతం నెలకొన్న క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో నిధుల విత్‌డ్రాయల్స్, బదిలీలను నిలిపేస్తున్నట్లు క్రిప్టో కరెన్సీ లెండింగ్ ఫర్మ్ సెల్సియస్ నెట్వర్క్ ప్రకటించింది. ఇది క్రిప్టో కరెన్సీ పరిశ్రమపై నెలకొన్న ఒత్తిడిని తెలియజేస్తున్నది.
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎథేర్ 8 శాతానికి పైగా పతనమై 1303 డాలర్లకు చేరుకున్నది. ఇది గతేడాది మార్చి నుంచి కనిష్ఠం. ద్రవ్యలభ్యతను స్థిరీకరించి కార్యకలాపాలను కొనసాగించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఎథేర్ కంపెనీ తెలిపింది.
ఇదిలా ఉంటే, కస్టమర్లను ఆకట్టుకునేందుకు రివార్డులను కొనసాగిస్తామని సెల్సియస్ నెట్వర్క్ పేర్కొంది. క్రిప్టో కరెన్సీ లెండింగ్‌లో కీలక భూమిక పోషిస్తున్న సెల్సియస్ నెట్వర్క్ 750 మిలియన్ డాలర్ల నిధులు సేకరించింది. క్రిప్టో కరెన్సీల్లో నగదు డిపాజిట్ చేసే కస్టమర్లకు ఇంటరెస్ట్ బేరింగ్ ప్రొడక్ట్స్‌ను ఆఫర్ చేస్తున్నది.
సెల్సియస్ నెట్వర్క్ గత నెలలో ఈ కంపెనీ 8.2 బిలియన్ డాలర్ల విలువ గల రుణాలు ప్రాసెస్ చేసింది. దీనికి 11.8 బిలియన్ డాలర్ల ఆస్తులన్నాయి. గతేడాది 20 బిలియన్ల డాలర్లకు పైగా సంపద ఉంది. ఒకవైపు ఒత్తిళ్లు కొనసాగుతున్నా, రెగ్యులేటరీ పర్యవేక్షణ మధ్య క్రిప్టో కరెన్సీలకు రుణాల మంజూరు పెద్ద బిజినెస్‌గా మారుతుందని చెబుతున్నారు.