CitiBank Work From Home | ప్రతి మహిళ తల్లి కావాలని కలలు కంటుంది. ఆధునిక మహిళగా కెరీర్లో ఉన్నత స్థానాలకు వెళ్లాలని కోరుకుంటూనే.. తల్లిగా తన మాతృత్వాన్ని పండించుకోవాలని తపన పడుతుంది. కానీ, ప్రస్తుతం భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తేనే కుటుంబ పోషణ కష్టతరంగా మారింది. ఈ పరిస్థితుల్లో మహిళ.. మాతృమూర్తిగా మారిన తర్వాత విధులకు వెళ్లాలంటే చిన్నారుల పోషణ చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ నేపథ్యంలో మహిళా ఉద్యోగులకోసం ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ‘సిటీ బ్యాంకు ఇండియా’ వర్క్ ఫ్రం హోం పాలసీ తీసుకొచ్చింది.
26 వారాల మెటర్నిటీ లీవ్ ముగిసిన తర్వాత మరో 12 నెలల పాటు మహిళా ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఆప్షన్ కల్పిస్తూ విధాన నిర్ణయం తీసుకున్నది సిటీ బ్యాంక్ ఇండియా. గర్భవతి చివరి మూడు నెలలు కూడా వర్క్ ఫ్రం హోం వెసులుబాటు కల్పించాలని రిక్వెస్ట్ చేయడానికి అనుమతి ఇచ్చింది. తల్లులు కానున్న మహిళలు, తల్లులకు 21 నెలల వర్క్ ఫ్రం హోం విధానాన్ని అందుబాటులోకి తెచ్చిన తొలి కార్పొరేట్ సంస్థగా ‘సిటీ బ్యాంక్ ఇండియా’ నిలిచింది. తొలుత భారత్లో తల్లులకు వర్క్ ఫ్రం హోం పాలసీ అమలు చేసి, తదుపరి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తామని సిటీ బ్యాంక్ ఇండియా అండ్ దక్షిణాసియా హెచ్ఆర్ హెడ్ ఆదిత్య మిట్టల్ తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అడ్వైజరీకి అనుగుణంగా మహిళలకు బెనిఫిట్ కల్పించేందుకు.. నూతన తల్లులు కెరీర్, కుటుంబాన్ని విజయవంతంగా బ్యాలెన్స్ చేసుకునేందుకు చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చినట్లు ఆదిత్య మిట్టల్ తెలిపారు. అందుకే తమ బ్యాంకులో పని చేస్తున్న మహిళా ఉద్యోగుల్లో తల్లులు, గర్భవతులైన వారికి వర్క్ ఫ్రం హోం పాలసీ అమలు చేస్తున్నామన్నారు.
ప్రస్తుతం సిటీ బ్యాంకు ఇండియాలో 30 వేల మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. వారిలో 38 శాతం మహిళలే. అందునా అత్యధికులు యువతీ యువకులే అత్యధికం. ‘భారీగా ఉన్న మా మహిళా ఉద్యోగులు తమ పిల్లల సంరక్షణ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. మేం ప్రతిపాదించిన వర్క్ ఫ్రం హోం పాలసీ వారికి అత్యంత ఆకర్షణీయంగానూ, వారిని కాపాడుకునేలా ఉంటుంది’ అని ఆదిత్య మిట్టల్ తెలిపారు. వచ్చే ఐదేండ్లలో సిటీ బ్యాంక్ ఇండియాలో 50 శాతం మహిళా ఉద్యోగులను నియమించుకోవాలని తలపోస్తున్నది.
మెటర్నిటీ దశలో ఫ్లెక్సిబుల్ వర్క్ ఆప్షన్లు అందుబాటులో లేకపోవడంతో చాలా మంది ఉద్యోగులు తమ కొలువులను వదులుకుంటున్నారు. ఫలితంగా సంస్థ నాయకత్వంలో మహిళా ప్రాతినిధ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నది. మహిళల ప్రతిభను కాపాడుకునేందుకు మున్ముందు మిడ్, సీనియర్ పొజిషన్లలో మహిళల భాగస్వామ్యం పెంచాలని సిటీ బ్యాంక్ ఇండియా భావిస్తున్నది.