హైదరాబాద్, ఆగస్టు 19 : అమెరికాకు చెందిన ఆర్థిక సేవల సంస్థ చార్లెస్ ష్వాబ్.. హైదరాబాద్‌లో టెక్నాలజీ కెపాబిలిటీ సెంటర్‌ను ప్రారంభించింది. 3.45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..ప్రపంచంలోని టాప్-10 బ్రోకరేజ్, ట్రేడింగ్ సంస్థల్లో తొమ్మిది హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు అందిస్తున్నాయని, సంపద, ఆస్తుల నిర్వహణ నుంచి మార్కెట్ మౌలిక సదుపాయాలు, ఏఐ, రిస్క్ టెక్నాలజీ వరకు ఇక్కడి నుంచే సేవలు అందిస్తున్నాయన్నారు.
గ్లోబల్ కంపెనీల అడ్డాగా హైదరాబాద్ మారిపోయిందని, దీంట్లోభాగంగా చార్లెస్ ష్వాబ్ కూడా ఇక్కడి నుంచి కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడం స్వాగతిస్తున్నట్టు తెలిపారు. నగరాన్ని గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్స్, వెల్త్ టెక్ హబ్‌గా మార్చాలన్న తమ లక్ష్యానికి టెక్నాలజీ సంస్థలు సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. ఈ సందర్భంగా కంపెనీ ఇండియా హెడ్, ఎండీ ప్రదీప్ మీనన్ మాట్లాడుతూ..వచ్చే ఏడాది చివరినాటికి ఈ సెంటర్లో ఉద్యోగుల సంఖ్యను 2 వేలకు పెంచుకోనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో కాంట్రాక్టర్ల ద్వారా అందిస్తున్న టెక్నాలజీ సేవలను ఇక నుంచి హైదరాబాద్ కార్యాలయం ద్వారా అందించాలనుకుంటున్నట్టు తెలిపారు.