EV Charging Infrastructure | దేశీయంగా విద్యుత్ వాహనాలను నడిపేందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పన దిశగా కీలక ముందడుగు పడింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) అనుబంధ కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (సీఈఎస్ఎల్) శుక్రవారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బాంబే (ఐఐటీ-బీ)తో భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు చేసింది.
దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ వసతుల కల్పనకు అవసరమైన ఫ్లాగ్షిప్ ఉత్పత్తులను ఈ రెండు సంస్థలు అభివృద్ధి చేస్తాయి. దేశీయ ఈవీ చార్జింగ్ వసతుల లక్ష్య సాధనకు సాంకేతిక పరమైన సొల్యూషన్స్, ఇండియన్ ఈవీ చార్జింగ్ ఎకో సిస్టమ్‌కు కస్టమైజ్డ్ సొల్యూషన్స్ ఈ రెండు సంస్థలు అందుబాటులోకి తెస్తాయి. ఈ లెటర్ ఆఫ్ అసోసియేషన్ (ఎల్వోఏ)పై సీఈఎస్ఎల్ ఎండీ కం సీఈవో మహువా ఆచార్య, ఐఐటీ-బీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అసోసియేట్ డీన్ ఏఎం ప్రదీప్ సంతకాలు చేశారు.
దేశీయంగా చౌక ధరకే క్లీన్ రిలయబుల్ ఇంధనాన్ని తయారు చేయడంపై సీఈఎస్ఎల్ ఫోకస్ చేసింది. ఈ సందర్భంగా సీఈఎస్ఎల్ ఎండీ కం సీఈవో మహువా ఆచార్య మాట్లాడుతూ విద్యుత్ వాహనాల వినియోగదారుల్లో విశ్వాసం కల్పించడానికి సమర్థవంతమైన ఈవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కీలకం కానున్నదని చెప్పారు. అలాగే దేశంలో ఈ-మొబిలిటీని ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటుందన్నారు.
ఐఐటీ-బీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ స్వరూప్ గంగూలీ మాట్లాడుతూ తమ రెండు సంస్థల భాగస్వామ్యంతో రవాణా రంగంలో కర్బన ఉద్గారాల నియంత్రణకు భారత్ జాతీయ, అంతర్జాతీయంగా నిర్దేశించుకున్న లక్ష్యాల సాధన దిశగా చర్యలు చేపతామన్నారు.