న్యూఢిల్లీ, జూలై 3 : బంగారం దిగుమతులకు కళ్లెం వేయాలని ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. సరికొత్త పసిడి నగదీకరణ పథకం (గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్-జీఎంఎస్)ను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే 2-3 వారాల్లో సవరించిన విధానాన్ని అమల్లోకి తెచ్చే వీలుందని ఓ ప్రముఖ జాతీయ దినపత్రిక కథనాన్నిబట్టి తెలుస్తున్నది. అయితే పునరుద్ధరించబడిన ఈ వెర్షన్లో ఈసారి జ్యుయెల్లర్స్నూ భాగస్వాముల్ని చేయనున్నట్టు సమాచారం. ఇంతకుముందు బ్యాంకులకే పరిమితం చేశారు మరి.
పసిడి నగదీకరణ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. ఇండ్లలో నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని (నగలు, నాణేలు, కడ్డీలు ఇతరత్రా) గృహస్తులు ఈ స్కీమ్ ద్వారా బ్యాంకుల్లో డిపాజిట్ చేయవచ్చు. డిపాజిట్ కాలపరిమితినిబట్టి 2.25 శాతం నుంచి 2.50 శాతం వరకు వడ్డీ ఆదాయాన్నీ పొందవచ్చు. మెచ్యూరిటీ సమయంలో మళ్లీ బంగారంగానైనా లేదా దానికి సమాన విలువలో నగదునైనా డిపాజిటర్లు తీసుకోవచ్చు.
బంగారం వినియోగంలో ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారుల్లో భారత్ కూడా ఒకటి. దేశీయ దిగుమతుల్లో ముడి చమురు తర్వాత స్థానం పసిడిదే. అయితే ఈ దిగుమతులన్నింటికీ డాలర్లలోనే చెల్లింపులు జరుగుతాయి. దీంతో విదేశీ మారకం కొరత ఏర్పడుతున్నది. పైగా దేశీయ కరెన్సీ రూపాయిపైనా ఒత్తిడి పెరుగుతున్నది. దీంతో దిగుమతుల్ని తగ్గించి కరెంట్ ఖాతా లోటు (క్యాడ్)ను అదుపులో పెట్టడానికి దేశంలోని ప్రజల వద్ద నిరుపయోగంగా ఉంటున్న పుత్తడిని వాడుకలోకి తేవాలని మోదీ సర్కార్ యోచించింది. అలా వచ్చిందే పసిడి నగదీకరణ పథకం. ఇందులో డిపాజిటైన బంగారాన్ని నగల తయారీదారులకు సరఫరా చేస్తే.. వారు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటారని, తద్వారా అలా మిగిలే విదేశీ మారకాన్ని ఇతర కీలక దిగుమతుల (ముడి చమురు, గ్యాస్, ఎరువులు ఇతరత్రా)కు వినియోగించుకోవచ్చన్నది ప్రభుత్వ ఆలోచన.
పసిడి నగదీకరణ పథకం పునరుద్ధరణపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగానే పనిచేస్తున్నదని తెలుస్తున్నది. అలాగే కొత్తగా తెస్తున్న పథకం ద్వారా కనీసం ఈసారి 1,000 టన్నుల బంగారాన్నైనా సేకరించాలని భావిస్తున్నది. అందుకే ఈసారి బ్యాంకులతోపాటు జ్యుయెల్లర్స్నూ ఈ స్కీమ్‌లో ప్రధాన భాగస్వాములుగా చేయనున్నారని చెప్తున్నారు. ప్రజలు తమ ఇండ్లలోని పుత్తడిని నగల వ్యాపారుల వద్దకు వెళ్లి అమ్ముకోవడం, లేదా పాత బంగారాన్ని కొత్త ఆభరణాలుగా మార్చుకోవడం చేయవచ్చని సంబంధిత వర్గాలు అంటున్నాయి. దీనివల్ల జ్యుయెల్లర్స్ సైతం ఆభరణాల తయారీకి అవసరమైన పసిడి కోసం దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని ఇండస్ట్రీ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక ఈసారి బ్యాంకు ల్లో డిపాజిట్ చేసే బంగారానికి అధిక వడ్డీరేట్లను అమలు చేసే వీలు కూడా ఉన్నట్టు చెప్తున్నారు. ఇదిలావుంటే గతంతో పోల్చితే ఇప్పుడు పసిడిపై పెట్టుబడులపట్ల అవగాహన పెరుగడంతో పెట్టుబడిదారులను, ముఖ్యంగా యువ మదుపర్లను డిజిటల్ గోల్డ్, బాండ్ల వైపునకు నడిపించేలా ఆకర్షణీయ నిర్ణయాలూ ఉంటాయన్న అంచనాలున్నాయి.
స్పాట్ మార్కెట్లో బంగారం ధరలు క్రమేణా పెరుగుతూపోతున్నాయి. శుక్రవారం తులం రేటు మరో 3 వేలకుపైగా ఎగిసింది. ఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాములు రూ.3,300 లేదా 2.2 శాతం ఎగబాకి రూ.1,50,800 (అన్ని పన్ను లు సహా) తాకింది. బలమైన గ్లోబల్ ట్రెండ్, బలహీనపడిన అమెరికా డాలర్.. బులియన్ మార్కెట్‌కు డిమాండ్‌ను తీసుకొచ్చాయని ట్రేడర్లు తాజా సరళిని విశ్లేషిస్తున్నారు. ఇక కిలో వెండి ధర కూడా రూ.5,000 లేదా 2.08 శాతం పుంజుకొని రూ.2,45,000 (అన్ని పన్నులు సహా)గా నమోదైంది. కాగా, హైదరాబాద్‌లో 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) ఈ ఒక్కరోజే రూ.2,950 ఎగబాకి రూ. 1,34,750 పలికింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 57.58 డాలర్లు పెరిగి 4,181.50 డాలర్లుగా ఉన్నది. సిల్వర్ 2.44 శాతం వృద్ధితో 62.45 డాలర్లకు చేరింది.
గతంలో తెచ్చిన జీఎంఎస్.. ప్రజల్ని ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అందుబాటులో ఉన్న ప్రభుత్వ వివరాల ప్రకారం.. గత ఏడాది మార్చి నాటికి దాదాపు 38 టన్నుల బంగారాన్నే సమీకరించగలిగారు. నిజానికి దేశంలోని కుటుంబాలు, ఆలయాలు, ట్రస్టుల వద్ద 25,000-50,000 టన్నులదాకా పసిడి నిల్వలున్నాయని వేర్వేరు అంచనాలు చెప్తున్నాయి. కాగా, పసిడి నగదీకరణ పథకంపట్ల డిపాజిటర్లలో ఆదరణ పెద్దగా లేకపోవడానికి గల కారణాలను చూస్తే..