కేంద్ర ప్రభుత్వం మునుపెన్నడూ లేనివిధంగా తొలిసారి 50 ఏండ్ల బాండ్‌ను పరిచయం చేస్తున్నది. దీర్ఘకాలిక సెక్యూరిటీలకు పెన్షన్ ఫండ్స్, జీవిత బీమా సంస్థలు, చారిటబుల్ ట్రస్టుల వంటి సంస్థాగత మదుపరుల నుంచి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొనే దీన్ని తీసుకొస్తున్నది. దీంతో ప్రభుత్వ రంగ బీమా కంపెనీ ఎల్ఐసీ ఇన్వెస్ట్మెంట్లకు ఈ బాండ్ కలిసొస్తుందన్న అంచనాలు మార్కెట్ వర్గాల్లో వినిపిస్తున్నాయిప్పుడు. కాగా, దేశీయ ఆర్థిక వ్యవస్థలో ఈ బాండ్‌ను ఓ భారీ నిర్ణయంగా పేర్కొంటున్న ఇండస్ట్రీ నిపుణులు.. దీర్ఘకాల ఆర్థిక భద్రతతోపాటు, పెట్టుబడుల ద్వారా తమ రిటైర్మెంట్ ప్రణాళికల్ని వేసుకునే ఎగువ మధ్యతరగతి మదుపరులకు లాభిస్తుందన్న అభిప్రాయాన్నీ వ్యక్తం చేస్తున్నారు. జీవిత బీమా, పెన్షన్స్, ప్రావిడెంట్ ఫండ్స్‌ల్లో గృహస్తుల పొదుపే ఎక్కువగా ఉంటుందని, ఈ బాండ్ల రాకతో వారి సొమ్ముకు మరింత ప్రయోజనం కలుగుతుందని బ్యాంకింగ్ విశ్లేషకులూ చెప్తున్నారు. కాగా, అక్టోబర్ 30 నుంచి నవంబర్ 3 వరకు రూ.10,000 కోట్ల విలువైన బాండ్లను అమ్మనున్నారు.