న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ బీవైడీ..సరికొత్త మాడల్‌ను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. 2025 ఏడాదికిగాను బీవైడీ సీల్ పేరుతో ఈ మాడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మూడు రకాలుగా లభించనున్న ఈ కారు 61.44 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన మాడల్ ధర రూ.41 లక్షలు, 82.56 కిలోవాట్ల బ్యాటరీ మాడల్ రూ.45.70 లక్షలు, 82.56 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన మరో మాడల్ ధర రూ.53.15 లక్షలుగా నిర్ణయించింది. పనితీరు, కంఫర్ట్, టెక్నాలజీ పరంగా భారీ మార్పులు చేసిన ఈ కారును అత్యధికంగా వృద్ధిని నమోదు చేసుకుంటున్న భారత్‌లో ప్రవేశపెట్టింది. 61.44 కిలోవాట్ల నుంచి 82.56 కిలోవాట్ల బ్యాటరీతో తయారైన ఈ కారు 510 కిలోమీటర్ల నుంచి 650 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇవ్వనున్నది. ప్రీమియం ఇంటీరియర్‌తో తీర్చిదిద్దిన ఈ కారులో 15.6 ఇంచుల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. కేవలం 3.8 సెకండ్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్నది.