Broad Band Data | రిలయన్స్ జియో రంగ ప్రవేశంతో ఇటీవలి వరకు చౌకగా లభించిన మొబైల్ డేటా.. ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలు ప్రియమయ్యాయి. మొబైల్ డేటాతోపాటు తక్కువ రేట్లకే లభిస్తున్న బ్రాడ్ బాండ్ సేవల రేట్లు కూడా పెరుగుతాయన్న సంకేతాలు వస్తున్నాయి. కోల్‌కతాకు చెందిన మేఘబెలా అనే బ్రాడ్‌బ్యాండ్ సంస్థ ఫౌండర్ తపాబ్రత ముఖర్జీ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. సమీప భవిష్యత్‌లో బ్రాడ్‌బాండ్ సేవల చార్జీలు పెరిగే చాన్స్ ఉందని పేర్కొన్నారు. పోటీ మార్కెట్లో ఇతర సంస్థలతో తలపడి వ్యాపార లావాదేవీలు సాగించాలంటే 15-20 శాతం వరకు చార్జీలు పెంచడం తప్పదన్నారు.
ఇటీవల పెరిగిన ఓటీటీ సేవల వినియోగాన్ని డేటా ప్యాకేజీలో కలిపేయడంతో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారని తపాబ్రత ముఖర్జీ చెప్పారు. అయితే చార్జీల పెంపుపై టెలికం దిగ్గజాలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. దీనిపై ఎయిర్టెల్, జియో ఇప్పటికైతే ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇటీవల బీఎస్ఎన్ఎల్ మినహా జియో.. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా మొబైల్ ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలు 20 శాతం వరకు పెంచేశాయి.