న్యూఢిల్లీ, ఆగస్టు 13: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) డిపాజిట్దారులకు ప్రత్యేక స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చింది. మాన్సూన్ ధమాఖా పేరుతో ప్రవేశపెట్టిన ఈ స్కీం కింద అత్యధిక వడ్డీని ఆఫర్ చేస్తున్నది బ్యాంక్. 399 రోజుల కాలపరిమితితో డిపాజిట్ చేసినవారికి 7.25 శాతం వడ్డీను చెల్లించనున్నది. అలాగే 333 రోజుల కాలపరిమితి కలిగిన మరో డిపాజిట్ స్కీంపై కూడా 7.15 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నది బ్యాంక్. దీంతోపాటు ఈ నెల 13 నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల డిపాజిట్లపై వడ్డీరేట్లలో పలు మార్పులు చేసింది. ఏడు రోజుల నుంచి 10 ఏండ్లలోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటు 4.25 శాతం నుంచి 7.25 శాతం మధ్యలో చెల్లిస్తున్నది. సీనియర్ సిటిజన్లకు మరో అర శాతం అధనంగా 4.75 శాతం మొదలుకొని 7.75 శాతం గరిష్ఠ స్థాయిలో ఆఫర్ చేస్తున్నది బ్యాంక్. రూ.3 కోట్ల లోపు డిపాజిట్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తించనున్నదని పేర్కొంది. అలాగే ఇప్పటికే ఫెడరల్ బ్యాంక్, పీఎన్బీ, కర్ణాటక బ్యాంక్, యూబీఐలు తమ వడ్డీరేట్లలో మార్పులు చేశాయి కూడా.