హైదరాబాద్, ఆగస్టు 18: దేశవ్యాప్తంగా పసిడి రుణాలు తీసుకునేవారి సంఖ్య భారీగా పెరుగుతుండటంతో వీరికోసం ప్రత్యేకంగా 251 గోల్డ్ లోన్ షాప్స్ను ప్రారంభించింది ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ). వీటిలో తెలంగాణతోపాటు ఏపీలలో 35 గోల్డ్ షాప్స్లను ప్రారంభించినట్లు బ్యాంక్ తెలిపింది.
దీంతో దేశవ్యాప్త గోల్డ్ లోన్ షాప్స్ సంఖ్య 1,238కి చేరుకున్నది. గోల్డ్ లోన్ కస్టమర్ల కోసం బ్యాంక్ శాఖ పరిధిలోనే ఈ షాప్స్ను ఏర్పాటు చేసినట్లు, వేగంగా రుణం తీసుకోవడానికి వీలుగా వీటిని నెలకొల్పినట్టు బీవోబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజయ్ కే ఖురానా తెలిపారు. రూ.3 లక్షల లోపు గోల్డ్ లోన్‌పై ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా ఎత్తివేసినట్లు, తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ, ఏపీతోపాటు గుజరాత్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బెంగాల్లో వీటిని ప్రారంభించింది.