న్యూయర్క్: మే 27: ఆన్లైన్ దిగ్గజం అమెజాన్ సీఈవో బాధ్యతల నుంచి తప్పుకునే తేదీని ప్రపంచ శ్రీమంతుడు జెఫ్ బెజోస్ ప్రకటించారు. జూలై 5న అమెజాన్ ఎగ్జిక్యూటివ్ అయిన ఆండీ జెస్సీ సీఈఓ బాధ్యతల్ని స్వీకరించనున్నారు. తనకున్న సెంటిమెంట్ కారణంగా ఆ తేదీని ఎంచుకున్నట్లు బెజోస్..బుధవారం జరిగిన అమెజాన్ షేర్‌హోల్డర్ల సమావేశంలో చెప్పారు. ఇంటర్నెట్ బుక్‌స్టోర్‌గా మొదలై ఆన్లైన్ షాపింగ్ దిగ్గజంగా ఎదిగిన అమెజాన్ 27 సంవత్సరాల క్రితం 1994న అదే తేదీన (జూలై 5) కంపెనీగా ఏర్పడింది. తాను సీఈవో పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే బెజోస్ ప్రకటించినప్పటికీ, తేదీని వెల్లడించలేదు. బెజోస్ స్థానంలోకి వస్తున్న ఆండీ జెస్సీ ప్రస్తుతం కంపెనీకి చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ వ్యాపారానికి నేతృత్వం వహిస్తున్నారు. 16,700 కోట్ల డాలర్ల సంపదతో ప్రపంచ ఐశ్వర్యవంతుల్లో అగ్రస్థానంలో వున్న బెజోస్ ఇకనుంచి అమెజాన్‌కు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగుతూ, కొత్త ఉత్పత్తులపై దృష్టిపెట్టనున్నారు. అలాగే ఆయన తన ఇతర వ్యాపారాలైన రాకెట్‌షిప్ కంపెనీ బ్లూ ఆరిజన్, వార్తాపత్రిక వాషింగ్టన్ పోస్ట్ తదితరాల్ని చూసుకుంటారు.