Bank Holidays | అక్టోబర్ నెలలో సగానికి పైగా రోజులు గడిచిపోయాయి. పండుగల వల్ల ఈ నెల రెండు వారాల్లో పలు రోజులు బ్యాంకులు పని చేయలేదు. వచ్చే 14 రోజుల్లో కూడా బ్యాంకులకు తొమ్మిది రోజులు సెలవులు ఉన్నాయి. ఈ నెల 18 నుంచి 31 తేదీల మధ్య బ్యాంక్ లావాదేవీల కోసం సంబంధిత శాఖకు వెళ్లాల్సి వస్తే ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో తెలుసుకుని ఖాతాదారులు తమ బ్యాంకు శాఖలకు ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ నెల 17 నుంచి దీపావళి, గోవర్ధన్ పూజ, భాయ్ దూజ్ వంటి పండుగలు, పర్వ దినాలతో బ్యాంకులకు సెలవులు ప్రకటించింది ఆర్బీఐ. అయితే, రాష్ట్రాలు, నగరాల వారీగా బ్యాంకు సెలవుల్లో తేడాలు ఉంటాయి. పలు రాష్ట్రాల్లో స్థానికంగా ముఖ్యమైన పండుగలు ఉంటే బ్యాంకులకు సెలవులు ప్రకటించింది ఆర్బీఐ.
ఈ నెల 22 నుంచి 24 వరకు దేశవ్యాప్తంగా బ్యాంకులు పని చేయవు. 22వ తేదీన నాలుగో శనివారం సందర్భంగా బ్యాంకులకు సెలవు. 23న ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి. గ్యాంగ్టక్, హైదరాబాద్, ఇంఫాల్ నగరాలు మినహా దీపావళి సందర్భంగా ఈ నెల 24న బ్యాంకులకు సెలవు. ఈ నెల 25న జైపూర్లో బ్యాంకులు మూసి ఉంటాయి.
దీపావళి సందర్భంగా ఈ నెల 24న స్టాక్ మార్కెట్లకు సెలవు. అలాగే ఈ నెల 26న దీపావళి బలిప్రతిపాద సందర్భంగా బ్యాంకులు పని చేయవు. అయితే దీపావళి నాడు 24వ తేదీ సాయంత్రం 6.15 గంటల నుంచి రాత్రి 7.15 గంటల వరకు స్టాక్మార్కెట్లు తెరుస్తారు. ముహూర్త ట్రేడింగ్ కోసం ఈ గంట సేపు స్టాక్ మార్కెట్లు పని చేస్తాయి. అదే రోజు మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా (ఎంసీఎక్స్) మూసి ఉంటుంది. శని, ఆదివారాల్లో స్టాక్ మార్కెట్లకు సెలవు.