BOB Festival Offer | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: గృహ, కారు, వ్యక్తిగత, విద్యా రుణాలపై ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) మంగళవారం పండుగ ఆఫర్లను ప్రకటించింది. 2023 డిసెంబర్ వరకూ ఇవి అమలులో ఉంటాయని బ్యాంక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. పండుగ ఆఫర్లలో భాగంగా వివిధ ప్రయోజనాల్ని, రాయితీలను అందించే నాలుగు కొత్త సేవింగ్స్ ఖాతాల్ని ప్రారంభించినట్టు తెలిపింది. తమ డెబిట్, క్రెడిట్‌కార్డు హోల్డర్లకు పండుగ ఆఫర్లను, డిస్కౌంట్లను అందచేయడానికి ఎలక్ట్రానిక్స్, ట్రావెల్, ఫుడ్ విభాగాల్లో టాప్ బ్రాండ్లతో ఒప్పందాలు చేసుకున్నట్టు బీవోబీ వెల్లడించింది.
పండుగ సీజన్లో గృహ రుణాలు కనిష్ఠంగా 8.40 శాతం వడ్డీ రేటు నుంచి లభిస్తాయని, కార్ లోన్లు 8.70 శాతంతో మొదలువుతాయని, ఈ రెండింటికీ ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా రద్దుచేస్తున్నట్టు బ్యాంక్ తెలిపింది. విద్యా రుణాల్ని 60 బేసిస్ పాయింట్ల డిస్కౌంట్‌తో 8.55 శాతం నుంచే అందిస్తున్నట్టు పేర్కొంది. విదేశాల్లో గుర్తింపు పొందిన విద్యా సంస్థలో సీటు పొందిన విద్యార్థులకు కొలాటరల్ లేకుండానే రుణం మంజూరు చేస్తామన్నది.