ముంబై, ఏప్రిల్ 21: తమ అనుబంధ సంస్థ, భారత్ అల్యూమినియం కంపెనీ (బాల్కో)లో లింగమార్పిడి చేసుకున్న ఏడుగుర్ని ఉద్యోగాల్లోకి తీసుకున్నట్టు వేదాంత అల్యూమినియం గురువారం తెలిపింది. ఇందులో నలుగురు క్యాస్ట్ హౌజ్ వద్ద ఫోర్క్లిఫ్ట్ పనుల్లో, ముగ్గురు చత్తీస్గఢ్లోని యూనిట్ వద్ద సెక్యూరిటీ విధుల్లో ఉన్నారని ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇదిలావుంటే ప్రభుత్వ రంగ సంస్థల్ని మొత్తంగా అమ్మేసి ప్రైవేటీకరించడానికి బదులు వాటిల్లో కొంతమేర షేర్లను విక్రయించి కార్పోరేటీకరిస్తే కేంద్రానికి మరింత నగదు, లాభాలు వస్తాయని వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ అన్నారు. అయితే గతంలో కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం నుంచి అగర్వాల్ కొనుగోలు చేయడం గమనార్హం. ఒక్కప్పటి సర్కారీ సంస్థ బాల్కోను సైతం 2000వ సంవత్సరంలో అప్పటి వాజపేయి ప్రభుత్వ హయాంలోనే అగర్వాల్ చేజిక్కించుకున్నారు.